2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు! | In Prakasam 16 members Arrested Connection With Mining Mafia | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ మాఫియా దోపిడీ రూ.1,000 కోట్ల పైమాటే!

Jan 20 2020 7:21 AM | Updated on Jan 20 2020 1:19 PM

In Prakasam 16 members Arrested Connection With Mining Mafia - Sakshi

సాక్షి, ఒంగోలు: గ్రానైట్‌ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్‌ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్‌ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్‌ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్‌ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్‌ సీఎం కూడా ఉన్నాడు. 

కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్‌ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్‌ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. 

అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు 
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్‌లైన్‌ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్‌ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్‌ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.పి.శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్‌ మాఫియా డొంకను కదిలించారు.

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్‌ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్‌ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్‌ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement