జననేతకు జైకొట్టిన జనగోదారి | Praja Sankalpa Yatra Successfully Completed in East Godavari | Sakshi
Sakshi News home page

జననేతకు జైకొట్టిన జనగోదారి

Aug 14 2018 3:53 AM | Updated on Aug 14 2018 8:30 AM

Praja Sankalpa Yatra Successfully Completed in East Godavari - Sakshi

ఊళ్లకు ఊళ్లే తరలి రావడంతో ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం జన గోదావరిగా మారింది. జనాభిమానం గోదారమ్మలా పొంగిపొర్లింది. అక్కచెల్లెమ్మలు పోటీపడి అడుగడుగునా హారతి పట్టగా, యువకెరటం ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బహిరంగ సభలకు ఇసుకవేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, మోసాలను నడిరోడ్డుపై జగన్‌ నిగ్గదీసినప్పుడు అశేష ప్రజానీకం ఈలలు.. కేకలతో ప్రతిస్పందిస్తూ మద్దతు పలికింది. చిన్నారులు మొదలు వయో వృద్ధుల వరకు.. అన్ని వర్గాల ప్రజలు జననేతతో మాట కలిపారు. మీ వెంటే ఉంటామంటూ చేతిలో చెయ్యేసి నడిచారు. సమస్యలూ చెప్పుకున్నారు. మీరొస్తేనే న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా జన సంద్రంగా మారి జననేతను అక్కున చేర్చుకుంది. ప్రజలతో మమేకమై.. సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రభంజనం సృష్టించింది. జూన్‌ 12వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించిన పాదయాత్రకు చరిత్రలో నిలిచిపోయేలా లక్షలాది జనం స్వాగతం పలికారు. అక్కడి నుంచి కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య, ఏజెన్సీకి సమీపంలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య పాదయాత్ర సాగింది.



ఈ క్రమంలో జననేత 2,700 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. పాదయాత్రలో ఆద్యంతం అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. నుదుట తిలకం దిద్ది మంగళ హారతులిస్తూ.. దిష్టితీస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో జననేతకు ఘన స్వాగతం పలికారు. వృద్ధులు సైతం ఓపిక తెచ్చుకుని రోడ్లపైకి వచ్చారు. యువకుల సందడి, విద్యార్థినుల హడావుడి, రాఖీలు కట్టిన అక్కచెల్లెమ్మల ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఓవైపు ఘన స్వాగతం పలుకుతూ.. మరోవైపు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చారంటూ అవ్వాతాతాలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తుల వారు, ప్రజా సంఘాలు, విద్యార్థులు కష్టాలు చెప్పుకున్నారు. ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని, ఉద్యోగాలు లేవని, తాగు, సాగు నీరు అందడం లేదని వాపోయారు. అందరి సమస్యలు ఓపిగ్గా విన్న వైఎస్‌ జగన్‌.. నవరత్నాలతో అందరినీ ఆదుకుంటామని, రాజన్న రాజ్యం తీసుకొస్తానని  భరోసా  ఇచ్చారు.



అందరిలోనూ ఉత్తేజం.. 
మండుటెండను లెక్కచేయలేదు. జోరున వర్షం కురిసినా వెనక్కు తగ్గలేదు. లక్షలాది మంది అభిమాన నేతతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, ప్రముఖ వైద్యుడు పితాని అన్నవరం, ఎన్‌ఆర్‌ఐ దవులూరి దొరబాబు, ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత బుర్రా అనుబాబు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే ప్రత్యేక హోదా కోసం జూలై 24వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చి పెద్దాపురంలో జననేత బంద్‌ను పర్యవేక్షించారు. ఊహించిన దానికంటే ఎక్కువగా పాదయాత్ర విజయవంతం కావడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిసలాడుతోంది.  ప్రభుత్వ తీరుతో నష్టపోయిన తాడిత, పీడిత జనానికి భరోసానిచ్చింది. జగన్‌ సీఎం అయ్యేలా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్ని వర్గాల వారు స్పష్టీకరిస్తున్నారు. జిల్లాలో 412 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన జననేత నేడు విశాఖ జిల్లాలో ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఇటు ఘనంగా వీడ్కోలు, అటు స్వాగతం పలకబోతున్నాయి. 

జిల్లాలో జననేత ఇచ్చిన ప్రధాన హామీలు..  
- దారీతెన్నూ లేని, నాటు పడవలే దిక్కైన గోదావరి లంక వాసుల సమస్యల పరిష్కారానికి హామీ.  
పేద ప్రజల ఇళ్ల రుణ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 
ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్థలం ఇచ్చి సొంతిళ్లు కట్టిస్తాం.. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి సకాలంలో డీఏలు ఇస్తాం. 
దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని పునరుద్ఘాటన. 
మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌.. డీజిల్‌పై సబ్సిడీ పెంపు.. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్‌.. ఫిషింగ్‌ హాలిడే సమయంలో రూ.10 వేల సాయం.. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షల సాయం, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ 
ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ.. గ్రామ సచివాలయాల ద్వారా 1.50 లక్షల ఉద్యోగాల కల్పన 
యానిమేటర్లకు రూ.10 వేల వేతనం 
కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయింపు. కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తాం. 
చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు, మగ్గం ఉన్న ప్రతీ ఇంటికి నెలకు రూ.2 వేలు.. ఆప్కోలో మార్పులతో ఆర్థిక పరిపుష్టి. 
తక్కువ పరిహారం పొందిన పోలవరం ముంపు బాధితులకు ఎకరాకు రూ.5 లక్షలు.. గతంలో పరిహారం పొందని వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం. 
జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. 
- ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలల దోపిడీని అడ్డుకుంటాం. ఫీజులు తగ్గిస్తాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement