డబ్బులివ్వలేదనే ఆశ్రమంపై కక్ష | Prabodhananda allegation on JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

డబ్బులివ్వలేదనే ఆశ్రమంపై కక్ష

Sep 22 2018 4:36 AM | Updated on Sep 22 2018 4:36 AM

Prabodhananda allegation on JC Diwakar Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ సోదరులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే పగబట్టి తమపై ఆరోపణలకు దిగుతున్నారని తాడిపత్రి సమీపంలోని ఆశ్రమం నిర్వాహకుడు ప్రబోధానంద పేర్కొన్నారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తత, జేసీ బ్రదర్స్‌తో విభేదాలు, ఆశ్రమంపై వచ్చిన ఆరోపణలపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. ఈమేరకు 44 నిమిషాల నిడివి కలిగిన ఓ వీడియోను విడుదల చేసిన ఆయన ఎక్కడ ఉన్నారో మాత్రం వెల్లడించలేదు. ప్రబోధానంద ఆందులో వెల్లడించిన అంశాలు ఇవీ..

బీజేపీ కార్యకర్తలకు అన్నం పెట్టాం..
‘గతంలో ఓ ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు పోటీ చేశారు. తాడిపత్రిలో రిగ్గింగ్‌ జరుగుతుందని 300 మంది బీజేపీ కార్యకర్తలు వచ్చారు. వారికి ఎక్కడా హోటళ్లలో భోజనం, నీళ్లు ఇవ్వకుండా జేసీ బ్రదర్స్‌ బెదిరించారు. ఆకలితో ఉన్నవాళ్లు ఆశ్రమానికి వచ్చి భోజనం పెట్టాలని, డబ్బులిస్తామని కోరారు. డబ్బులు వద్దని మేం భోజనం పెట్టాం. ఆశ్రయం కూడా కల్పించాం. దీంతో కక్షకట్టి మాపై గొడవకు దిగారు. దీంతో గొడవలు వద్దని మేం కర్ణాటకకు వెళ్లిపోయాం. 

నిలబెట్టి మాట్లాడాలనుకున్నారు..
2003లో తిరిగి వచ్చి దివాకర్‌రెడ్డితోనే మళ్లీ ఆశ్రమం ప్రారంభించాం. తర్వాత ఐదేళ్లకు పుస్తకావిష్కరణకు కూడా పిలిచాం. వారు డబ్బులు ఆశించినా మేం ఇవ్వలేదు. వారి ఇంటి వద్దకు వచ్చి అందరిలా కూర్చోకుండా నిల్చుని మాట్లాడాలని భావించారు. మేం కుదరదన్నాం. దీంతో మాపై కక్షకట్టారు. నీళ్లు, కరెంట్‌ నిలిపేశారు. అనుమతి కలిగిన ఇసుక లారీలను ఆర్నెళ్లు సీజ్‌ చేయించారు. ఆశ్రమానికి చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ ట్రాక్టర్‌ను కాల్చారు. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా మేం లొంగలేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని కొందరిని రెచ్చగొట్టి మాపై ఉసిగొల్పారు.

కుట్రపూరితంగానే నిమజ్జనం గొడవ
గణేశ్‌ నిమజ్జనాన్ని అడ్డం పెట్టుకుని తగాదా సృష్టించి మాపై కేసులు నమోదు చేయించాలని జేసీ బ్రదర్స్‌ భావించారు. జేసీ ప్రోద్భలంతో సీఐ సురేంద్రనాథరెడ్డి గ్రామస్తులను రెచ్చగొట్టారు. మాపై రాళ్లు వేయడంతో మావాళ్లు ప్రతి దాడి చేశారు. ఆశ్రమంలో 64 సీసీ కెమెరాలున్నాయి. ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలో చూడొచ్చు. 

ఏం జరుగుతోందో ప్రభుత్వానికి తెలియదా?
దివాకర్‌రెడ్డి చెబుతున్నట్లు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగితే లక్షల మంది భక్తులు ఎలా వస్తారు? ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు ఇక్కడ ఏం జరుగుతోందో తెలియదా? కేవలం మాపై బురదచల్లేందుకు ఇలా మాట్లాడుతున్నారు’. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement