గీత దాటితే.. వేటు తప్పదు! | Permissions Mandatory For Vinayaka Chavithi Festival | Sakshi
Sakshi News home page

గీత దాటితే.. వేటు తప్పదు!

Sep 7 2018 2:13 PM | Updated on Sep 7 2018 2:13 PM

Permissions Mandatory For Vinayaka Chavithi Festival - Sakshi

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని గురువారం అర్బన్, రూరల్‌ ఎస్పీలు విజయారావు, వెంకటప్పలనాయుడు స్పష్టంచేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జనాలను తమ సూచనలు, ఆదేశాల మేరకు నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలని సూచించారు. 

గుంటూరు:వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొనసాగే అన్ని కార్యక్రమాల నిర్వహణ, జాగ్రత్తలు, పోలీసుల ఆంక్షలను అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని పోలీస్‌ బాస్‌లు హెచ్చరించారు. అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు, రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పల నాయుడు గురువారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. నిర్వాహకులు తీసుకోవాల్సిన బాధ్యతలు, ముందస్తు అనుమతులు, జాగ్రత్తలు తదితర అంశాల గురించి వివరించారు. ఈనెల 13 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల కొనసాగింపు విషయంలో పోలీసుల సూచనలు, ఆదేశాల మేరకు సహకరించి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

నిబంధనలు ఇవీ...
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలి. భారీగా మండపాలు ఏర్పాటు చేసేవారు విధిగా సీసీ కెమెరాలను ప్రధాన ద్వారాల వద్ద ఏర్పాటు చేయాలి. అగ్ని నిరోధక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. బహిరంగ, ప్రయివేటు ప్రాంతాల్లో అనుమతులు తీసుకున్న అనంతరం మాత్రమే ఏర్పాటు చేయాలి. హైటెన్షన్‌ వైర్లకు దూరంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాలు ఏర్పాటు కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూసుకోవాలి. కాలుష్య నివారణలో భాగంగా 10 డెసిబుల్స్‌ లోపు శబ్ధం వుండేలా మైకులు ఏర్పాటు చేయాలి. రా>త్రి 10 గంటలకు కార్యక్రమాలను ముగించుకోవాలి. విగ్రహాలు, మండపాల వద్ద శాంతి నిర్వాహక కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని నిరంతరం గస్తీ కొనసాగిస్తుండాలి. ముఖ్యంగా అశ్లీల నృత్యాలు, డాన్స్‌లను వేయించకూడదు. మండపాల్లో విధిగా తొక్కిసలాట లాంటివి జరుగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి

ఆదేశాలు ఇవీ...
మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ముందుగా నిర్వాహక కమిటీ సభ్యులు పోలీసుల నుంచి అనుమతి పొందాలి. గతంలో విగ్రహాలు ఏర్పాటు చేసి ఘర్షణలు జరిగిన కమిటీలకు అనుమతులు ఇచ్చేదిలేదు. ఊరేగింపు విషయాన్ని ముందురోజునే పోలీసులకు తెలియజేయాలి. వారు సూచించిన మార్గం నుంచి మాత్రమే విగ్రహాలను తరలించాలి. ఊరేగింపులో బాణసంచా పేల్చడం నిషేధం. పోలీసులు సూచించిన చోటనే విగ్రహాల నిమజ్జనం చేయాలి. ఎలాంటి అల్లర్లు జరిగినా నిర్వాహక కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

సంతోషంగా జరుపుకోవాలి
ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలి. పోలీసు అంక్షలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సహకరించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. పోలీసుల గస్తీ ఆయా ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతుంది. నిర్వాహక కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు పాటించాలి. ఏదైనా సమస్య ఉంటే 94910 67826 సెల్‌ నంబరుకు సమాచారం అందించాలి.        
–సీహెచ్‌ విజయారావు, అర్బన్‌ ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement