పాపం.. సర్పంచ్ | Sakshi
Sakshi News home page

పాపం.. సర్పంచ్

Published Wed, Apr 27 2016 3:06 AM

పాపం.. సర్పంచ్ - Sakshi

* సీఎంను కలిసేందుకు అనుమతివ్వని పోలీసులు
* ఏజేసీ చెన్నకేశవరావునూ అడ్డుకున్న రోప్ పార్టీ
* ఇదేమి న్యాయమని పోలీసులను నిలదీసిన రైతులు

సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని అమరావతిలో వెలగపూడి గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేకత ఉంది. రాజధానికి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తోంది ఇక్కడే. రాజధాని చరిత్రలో తొలి నిర్మాణాలకు నెలవుగా మారిన వెలగపూడి అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ గ్రామ సర్పంచ్‌కి మాత్రం ప్రభుత్వ, ప్రొటోకాల్ పరంగా సరైన ప్రాధాన్యం లభించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు సర్పంచ్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని విస్మరిస్తున్నారు.

దీంతో ఏడు పదుల వయస్సున్న గ్రామ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి మంగళవారం సీఎంను కలవడం సాధ్యం కాక, నిర్లిప్తతతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబునాయుడు వెలగపూడి సచివాలయ నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. ఆయనను కలిసేందుకు గంట ముందుగానే అక్కడికి చేరుకున్న సర్పంచ్ శాంతకుమారి సీఎం రాగానే లోపలకు పంపాలని అక్కడున్న పోలీసులను కోరింది. పోలీసులెవ్వరూ పట్టించుకోలేదు.

కనీసం సమాధానం కూడా చెప్పలేదు. దగ్గరకెళ్లి తన చేతిలో ఉన్న గుర్తింపు కార్డును చూపి అక్కడున్న అధికారులనూ ప్రాధేయపడింది. ఫలితం లేకపోవడంతో మండు టెండలో పావుగంట సేపు నిలబడిన ఆమె ఆ తర్వాత పక్కనే ఉన్న టెంటు నీడలో కూర్చుండిపోయారు. ఎడమ కంటిలో శుక్లం తీయించుకున్న కారణంగా సోమవారం తెల్లవారు జామున జరిగిన సచివాలయ ప్రారంభోత్సవానికి రాలేకపోయానని, అదే  విషయాన్ని సీఎంకు వివరించడానికి వచ్చానని ఆమె మీడియాకు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం గ్రామ సర్పంచ్‌నైన తనకు సీఎంను కలిసే అవకాశం ఇవ్వాల్సి ఉందని ఆమె గుర్తు చేశారు. ఆ తర్వాత ఇక లాభం లేదనుకున్న ఆమె నిశ్శబ్దంగా లేచి ఇంటి ముఖం పట్టారు.
 
అడ్డుకున్న రోప్ పార్టీ ..
భూ సమీకరణ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సీఆర్‌డీఏ అదనపు జాయింట్ కమిషనర్ చెన్నకేశవరావుకూ ఇలాంటి అవమానమే ఎదురైంది. ఎంత చెప్పినా వినిపించుకోని పోలీసులు ఆయన్ని లోపలకు అనుమతించలేదు. రోప్ పార్టీ ఆయన్ని అడ్డుకుంది. దీంతో ఆయన కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు.
 
మండిపడ్డ రైతులు...

సీఎంను కలిసి వినతి పత్రం అందజేయాలని వచ్చిన మూడు గ్రామాల రైతులు కూడా పోలీసులపై మండిపడ్డారు. ‘విజయవాడ పోతే కలవనీయరు... ఇక్కడికొచ్చినా కలిసే అవకాశం ఇవ్వరు... ఏంటండీ ఇదీ’ అంటూ పోలీసు అధికారులను నిలదీశారు. మందడం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన బెజవాడ సాంబశివరావు, నరసింహారావులతో పాటు పది మంది రైతులు వినతిపత్రంతో వచ్చారు. జరీబు భూములిచ్చిన తమకు అదనంగా మరో 50 గజాల ప్లాట్లు ఇవ్వమని కోరేందుకు వచ్చారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో  సీఎం వెళ్లిపోయాక తహశీల్దార్ సుధీర్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా రైతులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement
 
Advertisement
 
Advertisement