కాంటాక్ట్‌ ఉందా... ఖాళీ చేయాల్సిందే!

Owners Are Evacuating People Infected With Corona From Their Homes - Sakshi

కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులపై అద్దె ఇళ్ల యజమానుల వివక్ష 

ఇళ్లు ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి 

కష్టకాలంలో నిర్దయగా వ్యవహరిస్తున్న కొందరు 

వివక్షను ఎదుర్కొనలేక లక్షణాలున్నా బయటికి రాని కొందరు 

పరీక్షలు చేయించుకోకుండా ఇంటి వైద్యానికే పరిమితం అవుతున్న వైనం

సాక్షి, గుంటూరు: గుంటూరు నగరం నెహ్రూనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న ఓ యువకుడు ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి మామ ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. దీంతో పాజిటివ్‌ వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న యువకుడి కుటుంబం మొత్తాన్ని వైద్యాధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న అనంతరం యువకుడి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అవ్వడంతో వైద్యులు ఇంటికి పంపారు. అయితే ఇంటి యజమాని మరో 14 రోజులు ఇంట్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పాడు. లేదంటే ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో చేసేదేమీ లేక యువకుడి కుటుంబం విజయవాడలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. విజయవాడ నుంచి రోజూ రాకపోకలు సాగిస్తూ గుంటూరులో యువకుడు విధులకు హాజరవుతున్నాడు.
 
గుంటూరు నగరంలోని ఓ కాలనీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి గత నెలలో కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. వైరస్‌ను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాడు. అప్పటివరకూ ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడే కాలనీ  వాసులు, చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా వెలేసినట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి మాటల్లో మునుపటి ఆప్యాయత కనపడటం లేదు. దీంతో ఈ వివక్షను భరించడం కన్నా ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లడం మంచిదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌ బారిన పడుతున్నారు.

అయితే వ్యాధితో పోరాడాల్సిన సమయంలో కొందరు రోగులతో పోరాటానికి దిగుతున్నారు. పాజిటివ్‌ రోగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపుతూ వారిని మరింత కుంగదీస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు కరోనా బాధితుల పట్ల వివక్ష చూపరాదనీ, వారికి మరింత భరోసా కల్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించాలని చెబుతూనే ఉన్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న బాధితుడు, కుటుంబ సభ్యులను ఇళ్లు ఖాళీ చేయాలని యజమానులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. చుట్టుపక్కల వాళ్లు, కాలనీ వాసులు వెలేసినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనాను జయించిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారు.    
         
బయటపడకుండా... 

అప్పటికే తమ కాలనీలు, నివాస ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ బాధితుల పట్ల కనబరుస్తున్న వివక్ష చూసి కొందరు వైరస్‌ లక్షణాలున్నప్పటికీ బయటపడటం లేదు. లక్షణాలున్నాయని వైద్య పరీక్ష చేయించుకున్నా, క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా ఇళ్లు ఖాళీ చేయమంటారనో, చుట్టుపక్కల వాళ్లు వివక్ష చూపుతారనో కొందరు ఇంటి వైద్యానికే పరిమితం అవుతున్నట్టు తెలుస్తోంది. మెడికల్‌ షాపుల్లో మందులు కొని, ఇంట్లో చిట్కాలు పాటించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో సంబంధాలున్నా, వైరస్‌ లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని వైద్యాధికారులు, వలంటీర్లను సంప్రదించి కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. 

కేసులు నమోదు చేస్తాం 
కరోనా పాజిటివ్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపవద్దు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రతి పాజిటివ్‌ రోగిని ఆసుపత్రికి తరలించి 14 రోజుల పాటు చికిత్స అందించి నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యాకే డిశ్చార్జ్‌ చేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ అయితే క్వారంటైన్‌ చేస్తున్నాం. అపోహలకు పోయి వారి పట్ల వివక్ష చూపడం మంచిది కాదు. వివక్షను ప్రదర్శించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. – ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ 

ఒత్తిడి చేయవద్దు 
అద్దె ఇళ్లల్లో ఉంటున్న కరోనా పాజిటివ్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేయవద్దు. వైరస్‌ పూర్తిగా నయమయ్యాకే వాళ్లు ఆసుపత్రి నుంచి ఇళ్లకు వస్తారు. అనంతరం కూడా హోం ఐసోలేషన్‌లో ఉంటారు. కరోనా వచ్చిందనే కారణంతో ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటాం.  
– విశాల్‌ గున్నీ, గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top