బంగారు ఆభరణాల కోసం ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలిని దొంగలు తాళ్లతో కట్టి హతమార్చిన ఉదంతమిది.
అమలాపురం రూరల్ :బంగారు ఆభరణాల కోసం ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలిని దొంగలు తాళ్లతో కట్టి హతమార్చిన ఉదంతమిది. పేరూరు తాటిగుంట మెరక గ్రామంలో ఈ దారుణం మంగళవారం రాత్రి వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తాటిగుంట మెరకలో ఒంటరిగా ఉంటున్న జల్లి సూర్యకుమారి(70)కి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఉద్యోగాల రీత్యా హైదరాబాద్, విశాఖపట్నం, గుడివాడ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. భర్త కుటుంబరావు ఐదేళ్ల క్రితం మరణించాడు. ఇక్కడున్న ఆరెకరాల పొలంతో పాటు ఆస్తిపాస్తులను చూసుకుంటూ సూర్యకుమారి పేరూరు తాటిగుంట మెరకలోని తన పెంకుటింట్లో నివసిస్తోంది. పి.గన్నవరం మండలం గంటిలో ఉంటున్న కుమార్తె రాజేశ్వరి తల్లిని సోమవారం చూసి వెళ్లింది. మంగళవారం ఉదయం ఆమె తల్లికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
సాయంత్రం మరోసారి చేసినా స్పందించకపోవడంతో ఆమె తల్లి ఇంటి సమీపంలోని బంధువైన మహిళకు ఫోన్ చేసి చూసిరమ్మని చెప్పింది. ఆ మహిళ వెళ్లి చూసే సరికి తలుపులు తెరిచి ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. మంచంపై తాళ్లతో కట్టి ఉన్న సూర్యకుమారి మృతదేహం కనిపించింది. కంగారపడ్డ ఆమె కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది. స్థానికులు ఈ విషయాన్ని సర్పంచ్ పెచ్చెట్టి చంద్రమౌళి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన సీఐ సీహెచ్ శ్రీనివాసబాబుకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు ఎస్సైలు బి.యాదగిరి, రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ధనవంతురాలైన సూర్యకుమారి మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు గాజులు ఉంటాయని, వాటితో పాటు ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాలు కూడా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతురాలి శరీరంపై బంగారు నగలు కనిపించలేదు.
దీంతో దుండగులు వాటి కోసమే ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రే ఆమెను హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పక్క గదిలో ఉన్న బీరువాలో దుస్తులు, సామగ్రి చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. సూర్యకుమారి గురించి బాగా తెలిసిన వారే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కాకినాడ క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు వస్తేకానీ ఏ మేరకు సొత్తు చోరీ జరిగిందనేది తెలియదని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.