నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబును కోరారు.
సీఎంతో భేటీలో ఎమ్మెల్యేల వినతి
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబును కోరారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటుతున్నా ఇంతవరకూ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఒక్కటీ దక్కలేదని చెప్పారు. ఈ విషయమై కార్యకర్తలు తమను గ్రామాల్లో పర్యటనకు వెళ్లినపుడు నిలదీస్తున్నారని, వారికి సమాధానం చెప్పుకోవటం గగనమవుతోందని వాపోయారు. పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు స్పంది స్తూ ఈ అంశాన్ని తనకు వదిలి పెట్టాలని, తాను చూసుకుంటానని చెప్పారు. శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అయినప్పుడు ఈ చర్చ వచ్చింది.
చంద్రబాబుతో నిర్మలా సీతారామన్ భేటీ
కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సీఎంతో భేటీ అయ్యీరు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ కూడా చంద్రబాబుతో లేక్‌వ్యూ అతిథిగృహంలో భేటీఅయ్యారు.కాగా లోక్‌సభ మాజీ స్పీకరు పీఏ సంగ్మా, ఆయన కుమార్తె కేంద్ర మాజీ మంత్రి ఆగాథా సంగ్మా శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు.
సంక్రాంతికి సొంత ఊరిలో బాబు..
సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోనున్నారు. 15న ఢిల్లీ పర్యటనకు వెళతారు.