శుభకార్యాలకు విరామం

No Wedding Dates in January - Sakshi

ఆరు నుంచి పుష్యమాసం ప్రారంభం

ఫిబ్రవరి ఆరు నుంచి శుభముహూర్తాలు

విజయనగరం మున్సిపాలిటీ: వివాహ, గృహ ప్రవేశ తదితర శుభ కార్యాలకు బ్రేక్‌ పడనుంది. ఈ నెల ఆరో తేదీన ధనుర్మాసం ముగిసి పుష్యమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నెల రోజుల పాటు హిందువులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.  జనవరి 6 నుంచి శూన్య మాసం ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఫిబ్రవరి 7నుంచి మార్చి 16 వరకు శుభ ముహూర్తాలు ఉన్నట్లు వేదపండితులు పేర్కొన్నారు. దీనివల్ల నెల రోజుల పాటు శుభకార్యాలు నిలిచిపోనుండగా...  హిందువులంతా సంప్రదాయ బద్ధంగా జరుపుకునే సంక్రాంతి పండగలో నిమగ్నం కానున్నారు.

పుష్యం శని దేవునికి ప్రీతికరం
తెలుగు సంవత్సరాది పన్నెండు నెలల్లో 10వ నెల పుష్య మాసం. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ కాలాన్ని జ్యోతిష్య శాస్త్రంలో శూన్యమాసంగా పేర్కొంటారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తూ మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి చెందిన రేఖ నుంచి కర్కాటక రాశికి చెందిన రేఖపై సూర్యగమనం ఉంటుంది. మకర రాశిపైన శని దేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. అందు కోసం ఈ మాసంలో శని ప్రీతి కోసం నవగ్రహ ఆరాధనలు  చేయటంతో పాటు పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు.

వసంత పంచమి నుంచి శుభ ముహూర్తాలు
చదువుల తల్లి సరస్వతీమాత జన్మతిథి వసంత పంచమి. ఈ పర్వదినాన్ని ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. నాటి నుంచి వివాహ, గృహ ప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభ ముహూర్తాలు ఆరంభమవుతాయి. వసంత పంచమి నాడు అక్షరభ్యాసం చేస్తే పిల్లల్లో మేథాశక్తి పెరుగుతుందని పెద్దలంటారు. గృహ ప్రవేశం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుందని నమ్మకం. ఆ రోజున వివాహం చేసుకుంటే దాంపత్యం దీర్ఘకాలం కొనసాగుతుందని పండితులు చెబుతారు.

నెల రోజులుశుభకార్యాలకు సెలవు
హిందూ సంప్రదాయం ప్రకా రం నెల రోజుల పా టు శుభకార్యాలు నిర్వహించ కూడదు. ఫిబ్రవరి 6 నుంచి పుష్యమాసం ప్రారంభం కానుంది. మరల ఫిబ్రవరి 6వ తేదీ వరకు నెల రోజుల పాటు అందరూ పిలుచుకునే శూన్యమాసం ఉంటుంది. నెల రోజుల తరువాత శుభకార్యాలు నిర్వహించుకోవాలి.–పి.కామేశ్వరరావు, వేదపండితులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top