బోట్లలో భద్రత ప్రశ్నార్థకం

No Safety in Boats Krishna - Sakshi

సెలవుల నేపథ్యంలో భవానీ ద్వీపానికి పోటెత్తిన ప్రయాణికులు

నిబంధనలు గాలికి వదిలేసిన పర్యాటక శాఖ

సాక్షి,విజయవాడ: పర్యాటక శాఖ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు. బోట్లల్లో పరిమితికి మించి ఎక్కించడం.. లైఫ్‌ జాకెట్లు లేకుండా నదిలోకి తీసుకెళ్లడం చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా భవానీ ద్వీపానికి సందర్శకుల తాకిడి బుధవారం బాగా పెరిగింది. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నడిచే బోట్లు కిటకిటలాడాయి. సందర్శకుల భద్రతను నీళ్లకు వదిలేశారు.

లైఫ్‌ జాకెట్లు లేకుండా...
కృష్ణానదిలో పడవ మునిగి 22 మంది చనిపోయిన ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది.. అయినప్పటికీ పర్యాటక శాఖ పాఠం నేర్వలేదు. నదిలో ప్రయాణించే బోట్లలో ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు వేసుకోవాలనే నిబంధన ఉంది. లైఫ్‌ జాకెట్‌ వేసుకోని వారిని బోట్లలోకి అనుమతించకూడదు. నిర్ణీత సభ్యుల కంటే ఎక్కువమంది బోటులోకి ఎక్కించ కూడదు. అయితే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మందిని బోటులోకి ఎక్కించారు. 50 మంది ఎక్కాల్సిన బోటులోకి 75 మందిని అనుమతించారు.ప్రయాణికులకు కావాల్సిన లైఫ్‌ జాకెట్లను అందుబాటులో ఉంచలేదు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్కడ లేరు. కిందిస్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు.

ప్రైవేటు బోట్లదీ అదే తీరు..
ప్రైవేటు బోట్లు నిబంధనలకు నీళ్లు వదలి యథేచ్ఛగా నదిలో విహారం చేశాయి. జలవనరులశాఖ, పర్యాటక సంస్థ, రెవెన్యూ అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top