భారత దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరో ప్రత్యామ్నాయమే లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: భారత దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరో ప్రత్యామ్నాయమే లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. పంచవర్ష ప్రణాళికలు, బ్యాంకుల జాతీయీకరణ, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు మొదలు ఆర్థిక సంస్కరణలు, ఉపాధి హామీ, ఆహార భద్రత, విద్యా, సమాచార హక్కు, లోక్‌పాల్ బిల్లు వరకు ఏ రంగంలో చూసినా కాంగ్రెస్ ముద్ర స్పష్టంగా కన్పిస్తుందన్నారు. కాంగ్రెస్ 129వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గాంధీభవన్ ఆవరణలో పీసీసీ చీఫ్ పార్టీ జెండా ఎగరవేశారు. పార్టీ ముఖ్య నేతలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన నగరంలోనే ఉన్నప్పటికీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, వీహెచ్ ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు, పీసీసీ సేవాదళ్ ఛైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలితసహా పలువురు పీసీసీ ఆఫీస్ బేరర్స్ హాజరయ్యారు.