అంతన్నారు.. ఇంతన్నారే!!

హైదరాబాద్ నగరానికి దీటుగా సరికొత్త రాజధాని నగరాన్ని కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తామంటూ ఎన్నికలకు ముందు బీరాలు పలికిన బీజేపీ నాయకులు అంతలోనే అసలు విషయం తేల్చిపారేశారు. ముఖ్యంగా, రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు చించుకున్నట్లు బిల్డప్ ఇచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు.. ఇప్పుడు కేంద్రంలో మంత్రిపదవి వచ్చాక పల్లవి మార్చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని ఆయన తేల్చి చెప్పేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన కొత్త రాజధాని నిర్మాణం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై అప్పుడే నీళ్లు చల్లేశారు. హైదరాబాద్ లాంటి రాజధానిని కోరుకోవడం, అలాంటి ఆలోచన చేయడం తగదని, అది అర్థరహితమని మంత్రిగారు కుండబద్దలు కొట్టేశారు. మనకి ఎంత కావాలో, ఏం కావాలో చూసుకుని అంతే వస్తుందని అర్థం చేసుకోవాలన్నారు.
దీన్ని బట్టి చూస్తుంటే.. ఏదో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రాల స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ను కూడా చూసి, అక్కడ కూడా ఏదో ద్వితీయశ్రేణి రాజధాని నగరాన్ని పేరుకు నామామత్రంగా అంటగట్టేసే ప్రయత్నాల్లో కమలనాథులు ఉన్నారేమోనన్న అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.