దేశ ప్రజల చూపు నరేంద్ర మోడీ వైపే ఉందని, కులమత ప్రాంతాలకు అతీతంగా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి/గౌతంనగర్, న్యూస్‌లైన్: దేశ ప్రజల చూపు నరేంద్ర మోడీ వైపే ఉందని, కులమత ప్రాంతాలకు అతీతంగా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి బృందావన్ గార్డెన్స్‌లో పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ కమిటీ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని... నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులకే ధరలను తగ్గిస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఫలితం లేకపోయిందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు అవినీతిరహిత పాలన అందిస్తారని అన్నారు. దేశానికి ఆశాకిరణమైన నరేంద్ర మోడీకి అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
తెలంగాణలో బీజేపీయే కీలకం...
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు దశ దిశ నిర్దేశించే శక్తిగా బీజేపీ వ్యవహరిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని, ఇక పొత్తులకు తావులేదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే బీజేపీ బలపడుతుందని బహిరంగంగానే చెబుతున్నాయని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో బీజేపీ పటిష్టంపై కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గుజరాత్ నర్మదా తీరంలో వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి ప్రజలు, విద్యార్థుల మద్దతు కూడగట్టాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు పాండు ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఇంద్రసేనా రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, మీసాల చంద్రయ్య, మల్లారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బాలలింగం, ఆర్.క్శై, చంద్రశేఖర్, భీంరావు, మంత్రి శ్రీనివాస్, ప్రియతం రామకృష్ణ, వరలక్ష్మి, స్వరూప, శైలజ పాల్గొన్నారు. మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన సమావేశానికి మీర్జాలగూడ నుంచి బీజేపీ నాయకులు ర్యాలీగా తరలివెళ్లారు. ప్రధాన రహదారులన్నీ కాషాయమయమయ్యాయి. పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌ముదిరాజ్ నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.