ఎక్కడి చెత్త అక్కడే!

municipal Workers Strike In Kurnool - Sakshi

సమ్మె బాటలో మున్సిపల్‌ కార్మికులు

రెండోరోజు విధుల బహిష్కరణ

నగరంతో పాటు మున్సిపాల్టీల్లో పేరుకుపోతున్న చెత్త

ప్రైవేటు వ్యక్తులతో చెత్త తరలింపునకు రంగం సిద్ధం?

అడ్డుకుంటామంటున్న జేఏసీ నాయకులు

కర్నూలు (టౌన్‌): ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కర్నూలు కార్పొరేషన్‌లో మున్సిపాల్టీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 279 జీవోను రద్దు చేయాలని మున్సిపల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు. రెండో రోజు ఆదివారం జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, గుడూరు మున్సిపాలిటీలలో కాంట్రాక్టు పద్ధతిన  పనిచేస్తున్న  కార్మికులు సమ్మె కొనసాగించారు. జిల్లాలోని 9 మున్సిపాల్టీలలో 2,500 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో 500 మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో చెత్త సేకరణ సమస్యగా మారింది. కార్మికులు విధులను బహిష్కరించడంతో కల్లూరు, పాత కల్లూరు, స్టాంటన్‌పురం, మామిదాల పాడు, మునగాలపాడు ప్రాంతాల్లో  చెత్త పేరుకుపోతుంది. అలాగే ఇంటింటికి చెత్త రెండురోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయింది.  

విధుల బహిష్కరణ– నగరంలో ర్యాలీ
జీవో 279 రద్దు చేయాలని ఐఎన్‌టీయూసీ నాయకుడు రమణ, ఏఐటీయూసీ నాయకుడు రామకృష్ణారెడ్డి సీఐటీయూ రాముడు,  వైఎస్‌ఆర్‌ టీయూసీకి చెందిన నాయకుడు స్వాములు డిమాండ్‌ చేశారు. రెండో రోజు అన్ని యూనియన్లకు కన్వీనర్‌గా వై.వి.రమణ నాయకత్వం వహించారు. కర్నూలులో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ ఒపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ నుంచి కొండారెడ్డి బురుజు, కోట్ల సర్కిల్‌ వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడే మానవహారం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. కార్మికులపై కేసులు బనాయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల పొట్టగొడుతున్న జీవో 279 రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం, అవసరానికి తగ్గట్లు కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు.  

ప్రైవేటు వ్యక్తులతో చెత్తతరలింపునకు రంగం సిద్ధం
రెండు రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. రాత్రి 1 గంట తరువాత పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రైవేటు వ్యక్తులను నియామించాలని నిర్ణయించింది. అలాగే కర్నూలులో రెగ్యులర్‌ కింద 348 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నగరంలో ఉన్న 13 డివిజన్లలో డివిజన్‌కు 15 నుంచి 20 మందిని  కేటాయించి పారిశుద్ధ్య పనులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. కాగా సమ్మెను నీరుగార్చే చర్యలకు ప్రభుత్వం పాల్పడితే అడ్డుకుంటామని జేఏసీ నాయకులు రమణ చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెలో పాల్గొంటున్నామని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడలకు పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top