'డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!
రాజ్యసభ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న నేతలు నందమూరి హరికృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికలు ఆపార్టీ నేతల్లో అసహనాన్ని, ఆగ్రహాన్ని నింపాయి. రాజ్యసభ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న నేతలు నందమూరి హరికృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ, సోమిరెడ్డి, మోత్కుపల్లిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకొచ్చారు. ఓ దశలో డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా అని చంద్రబాబుపై మోత్కుపల్లి విరుచుకుపడినట్టు సమాచారం.
గతంలో కూడా ఇలాగే చేశారని బాబుపై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్ని కష్టాలెదురైనా పార్టీలోనే ఉన్నాం అయినా గుర్తించారా? అంటూ మోత్కుపల్లి నిలదీశారు. తన ఆగ్రహాన్ని మీడియాతో పంచుకునేందుకు సమావేశం హాలునుంచి బయటకొచ్చేసిన మోత్కుపల్లిని సీనియర్ నేతలు నామా నాగేశ్వర్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు సముదాయించి లోనికితీసుకెళ్లారు. పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభైన కాసేపటికే హరికృష్ణ, సోమిరెడ్డిలు బయటకు వచ్చారు.