చారిత్రక తీర్పునకు ఇక 24 గంటలే

More 24 hours for Historic judgment  - Sakshi

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం 

రేపు ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్‌

ఏజెన్సీలోని రెండు నియోజకవర్గాల్లో సా.4 గంటల వరకే పోలింగ్‌

ఓటరు కార్డు లేకపోతే ప్రత్యామ్నాయంగా 11 కార్డులతో ఓటు 

ప్రలోభాలకు తెరలేపిన అధికార పార్టీ

సాక్షి, అమరావతి :  మార్పు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజల చారిత్రక తీర్పునకు ఇక 24 గంటలే గడువు ఉంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత పక్షం రోజులుగా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఇప్పటివరకు ప్రచార హోరుతో మోగిన మైక్‌లన్నీ మూగబోయాయి. వివిధ పార్టీలు చేసిన ప్రచారం, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఓటర్లు బేరీజు వేసుకోవడానికి గురువారం ఉదయం 7 గంటల వరకు సమయం ఉంది. ఏ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తమ భవిష్యత్‌ బాగుంటుందో ఆలోచించుకుని మరీ ఓటు వేసేందుకు రాష్ట్రంలోని 3.93 కోట్ల ఓటర్లు ఎదురుచూస్తున్నారు. వీరిలో 1.94 కోట్ల మంది పురుషులు కాగా.. 1.98 కోట్ల మంది మహిళలు. ట్రాన్స్‌జెండర్స్‌ 3,957 మంది ఉన్నారు. మరోవైపు.. ఓటర్ల తీర్పు ఈసారి మార్పు కోసం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. అయితే, ప్రలోభాల పర్వానికి, అరాచకాలకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఓటర్లను బెదిరించడం వంటి చర్యలకు టీడీపీ అభ్యర్థులు పాల్పడుతున్నారు. అంతేకాక.. చాటుమాటు వ్యవహారాలకు అధికార పార్టీ తెరతీసింది.

అక్కడ సా.4గంటల వరకే పోలింగ్‌
రాష్ట్రంలోని అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఇదే లోక్‌సభ స్థానం పరిధిలోని కురుపాం, పార్వతిపురం, సాలూరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉ.7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించాలని కూడా ఈసీ నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాలైనందున చీకటి పడకుండా అక్కడి నుంచి ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకే పోలింగ్‌ను త్వరగా ముగిస్తున్నారు. మిగతా అన్ని నియోజవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. కాగా, సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ పోలింగ్‌ సిబ్బంది స్లిప్‌లు ఇస్తారు. స్లిప్‌లున్న వారందరూ ఓటు వినియోగించుకునేందుకు వీలుగా ఎంత రాత్రి అయినా అవకాశం కల్పిస్తారు.

హోర్డింగ్‌ల అనుమతులూ రద్దు
మంగళవారం సా.6 గంటల తరువాత అభ్యర్థులు, పార్టీలు ఎటువంటి ప్రచారం చేయరాదు. ఇప్పటివరకు హోర్డింగ్‌లకు ఇచ్చిన అనుమతులు కూడా రద్దు అవుతాయి. 6 గంటల తరువాత ఎటువంటి ప్రచార ప్రకటనలు జారీచేసినా ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. మీడియా కవరేజీకి సంబంధించి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది.

అంతేకాక..
- ఈ నెల 10, 11 తేదీల్లో పత్రికల్లో జారీచేసే ప్రకటనలకు అభ్యర్థులు సంబంధిత ఎంసీఎంసీల కమిటీకి తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
కేవలం ఆయా అభ్యర్థులు వారి పార్టీ గుర్తు, ఈవీఎం పరికరంలో వారి పేరు.. పార్టీ చిహ్నం.. ఇండిపెండెంట్, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, బ్యాలెట్‌ బాక్సులో వారి క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయవచ్చునని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ తెలిపారు. ఇందుకోసం తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. 
మంగళవారం సా.6 గంటల నుంచి గురువారం సా.6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయాలి. దీనిని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు. కాగా, ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో మైక్రో పరిశీలకులను.. నియోజకవర్గాల్లో పరిశీలకులను ఈసీ నియమించింది. అభ్యర్థులు,  ఏజెంట్లు తమ సమస్యలను వీరి దృష్టికి తీసుకువెళ్లాలి. 

గుర్తింపు కార్డు లేకపోయినా వీటితో ఓటు వెయ్యొచ్చు
ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినప్పటికీ 11 ప్రత్యామ్నాయ కార్డుల ద్వారా ఓటు వేయవచ్చు. అవి.. పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీచేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు.. బ్యాంకులు, పోస్టాఫీసులు జారీచేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌లు, పాన్‌ కార్డు, ఎన్‌పీఆర్‌ నుంచి ఆర్‌జీఐ జారీచేసిన స్మార్ట్‌ కార్డులు, ఉపాధి హామీ పథకం కూలీ గుర్తింపు కార్డు, కేంద్ర కార్మిక శాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, ఫొటోతో కూడిన పెన్షన్‌ డాక్యుమెంట్‌.. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీచేసిన ఆమోదిత గుర్తింపు కార్డులు, ఆధార్‌ కార్డులు ద్వారా ఓటు వేయవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top