
మోదీ పాలనపై కాంగ్రెస్ పుస్తకం
ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో భ్రమలు...
- హామీలను విస్మరించారని నేతల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో భ్రమలు తొలిగిపోయాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రధాని మోదీ ఏడు నెలల కాలంపై ఏఐసీసీ ఇంగ్లిష్‌లో ప్రచురించిన ‘మోదీ యూ టర్న్’ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలుగులోకి అనువందింపచేశారు.
శుక్రవారం ఈ పుస్తకాన్ని పొన్నాల, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసన మండలిలో కాంగ్రెస్ పక్షనేత డి.శ్రీనివాస్ గాంధీభవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనపై వారు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ టీఆర్‌ఎస్ అమలు చేయలేదని పొన్నాల అన్నారు.
రైతుల ఆత్మహత్యలను నిలవరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు మోదీ చెప్పిన దానికి.. ప్రస్తుత పాలనకు పొంతనే లేదని డీఎస్ విమర్శించారు. కార్యక్రమంలో జానారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.