
దీక్షను చూసి ఓర్వలేకే టీడీపీ ర్యాలీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్షకు వచ్చిన విశేష స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు
పాలకొల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్షకు వచ్చిన విశేష స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు ర్యాలీల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. స్థానిక ఏఎంసీ అతిథి గృహంలో సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలతోపాటు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ చరిష్మాతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన చంద్రబాబు సాకులు చూపుతూ రూ.82 వేల కోట్ల రుణమాఫీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన పోరాటానికి విశేష స్పందన వస్తోందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణపై సీబీఐ విచారణ జరిపించుకుని నీతిమంతుడిగా నిరూపించుకోవాలని శేషుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రం విడిపోవడం వల్ల లోటుబడ్జెట్ అంటూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంగళ ం పాడే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఏడు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రైతు దీక్ష విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తొలి సంతకంతోనే తొలి మోసం ప్రారంభించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.
జగన్‌పై నిందలు వేస్తే సహించం
వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ ప్రచారం కోసమో, చంద్రబాబు మెప్పుకోసమే జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు వేస్తే పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పార్టీ రైతు నాయకుడు కైలా నర్సింహరావు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే రామానాయుడు పెదవి విప్పకపోవడం సరికాదన్నారు. మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, కౌన్సిలర్లు దొమ్మేటి వెంకట్రావు, కావలి చంద్రావతి, ధనాని దుర్గమ్మ, నాయకులు ఖండవల్లివాసు, మద్దా చంద్రకళ, ఎం.మైఖేల్‌రాజు, జోగి లక్ష్మీనారాయణ, గవర బుజ్జి, కావలి శ్రీను పాల్గొన్నారు.