ఇలా చేశావేంటమ్మా..!

MLA Lalitha Kumari Failed To Fulfill Her Promises In Lakkavarapukota - Sakshi

జూనియర్‌ కళాశాల హామీని కలగా మిగిల్చావు..

విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నావు..

ఆవేదనలో విద్యార్థిలోకం

సాక్షి, లక్కవరపుకోట (ప్రకాశం): ఎల్‌.కోట... ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సొంత మండలం. ఆ మండల విద్యార్థులనే ఆమె మోసం చేశారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ ఎల్‌.కోటకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేయిస్తానని హామీ ఇస్తారు. అనంతరం వాటిని పక్కనపెడతారు. ఇది ఆమెకు షరామామూలే అయినా మండల విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. ఏటా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పొరుగుమండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వ్యయప్రయాసలు తప్పడంలేదు. ఆర్థిక స్థోమతలేని విద్యార్థులు పదోతరగతితోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు. సొంత మండలంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఆడపిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. అమ్మా... ఇంకా ఎన్నాళ్లిలా మోసం చేస్తావంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నా.. ఆమె నుంచి సమాధానం లేదు.

లక్కవరపుకోట మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు కలగానే మిగిలింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇంటటర్‌ విద్య అందని ద్రాక్షగా మారింది. ఇంటర్మీడియట్‌ చదువుకోసం శృంగవరపుకోట, కొత్తవలస మండలాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గతంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో కొన్నిగదులు జూనియర్‌ కళాశాలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. కళాశాల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషిచేస్తానని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాసిన 583 మంది విద్యార్థులకు ఇంటర్‌ విద్యాకష్టాలు తప్పడం లేదు.

ఉత్తరాపల్లి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒక్క పర్యాయం తప్ప మిగిలిన అన్ని పర్యాయాలు మాజీ మంత్రి దివంగత కోళ్ల అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో శృంగవరపుకోట నియోజకవర్గంగా మారింది. కోళ్ల అప్పలనాయుడు కోడలు కోళ్ల లలితకుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏళ్ల తరబడి అదే కుటుంబ పాలన సాగిస్తున్నా కళాశాల మంజూరుకు చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో లక్కవరపుకోట మండల కేంద్రంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు. పాలకులు మారితే తప్ప కళాశాల మంజూరు కాదని, విద్యార్థులకు ఇంటర్‌ విద్య అందుబాటులోకి రాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం
మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రమే. మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేకపోవడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు కళాశాలలో చేరాను. నాలాగే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మండలానికి చంద్రబాబు వచ్చి ప్రభుత్వ కళాశాల  మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికీ కార్యరూపం దాల్చలేదు.
–పి.శ్రీను, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, లక్కవరపుకోట

ఏం చేయాలో అర్థంకావడం లేదు 
మా కుటుంబం కొద్ది సంవత్సరాల కిందట బతుకు తెరువుకోసం ఎల్‌.కోట మండలం వచ్చాం. నేను ఈ ఏడాది స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి పరీక్షలు రాసాను. ఇంటర్‌ విద్యకు ప్రైవేట్‌ కళాశాలలో చేర్పించే స్థోమత మా తల్లిదండ్రులకు లేదు. నాకు మాత్రం డాక్టర్‌ చదవాలని ఉంది. ప్రభుత్వ కళాశాల ఉంటే మాలాంటి పేదావాళ్లు చదువుకునే అవకాశం ఉండేది. ప్రస్తుత ఏడాది ఏ కళాశాలలో చేరాలో తెలియడం లేదు.
–మహంతి రాకేష్,సోంపురం జంక్షన్, లక్కవరపుకోట మండలం

ప్రభుత్వ కళాశాల కావాలి
నేను  ఈ ఏడాది పదో∙తరగతి పరీక్షలు రాశాను. ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఇంటర్‌ ఎక్కడ జాయిన్‌ కావాలో తెలియడం లేదు.  మా లాంటి విద్యార్థుల గోడు పాలకులకు పట్టడం లేదు. 
– ఆబోతు మణికంఠ, ఎల్‌.కోట

కనికరం లేదు
నేను స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాశాను. ఇంటర్మీడియట్‌ చదవాలంటే ఎస్‌.కోట, కొత్తవలసకు వెళ్లాలి. వ్యయప్రయాసలు తప్పవు. కళాశాలను ఏర్పాటు చేసి మాలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలి.
– టి.దీపిక, గొల్జాం గ్రామం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top