‘గ్రేటర్’ ప్రత్యేక రాష్ర్టం కావాలి! | ministers nagendar and mukesh demand for seperate Hyderabad state | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ ప్రత్యేక రాష్ర్టం కావాలి!

Aug 27 2013 6:14 AM | Updated on Aug 21 2018 12:12 PM

రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలే తప్ప హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులకు రక్షణ ఉండదని హైకమాండ్ భావిస్తే గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్(హెచ్‌ఎండీఏ) పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను వారు తెరపైకి తెస్తున్నారు. మొత్తం 55 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని 16, రంగారెడ్డిలోని 22, మెదక్‌లోని 10, నల్లగొండలోని 5, మహబూబ్‌నగర్‌లోని 2 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. వీటిలో 849 గ్రామాలు కూడా ఉన్నాయి. సుమారు కోటి మందికిపైగా జనాభా కలిగిన హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 25 శాతం మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
 
 ఈ ప్రాంతాన్ని మొత్తం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే సీమాంధ్రులతోపాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారికి ఎలాంటి భయమూ ఉండదని హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సిక్కిం, మణిపూర్, మేఘాలయా వంటి రాష్ట్రాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రం సంఖ్యాపరంగా చాలా పెద్దదని చెబుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, నలుగురు పార్లమెంటు సభ్యుల సంతకాలు కూడా తీసుకునే పనిలో పడినట్లు సమాచారం. గ్రేటర్ బ్రదర్స్‌గా పిలుచుకునే మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ ఈ బాధ్యత తీసుకున్నారు. ఈనెల 28న వీరిద్దరు ఢిల్లీ వెళ్లి ఏకే ఆంటోనీ కమిటీని కలిసి ఆయా నేతల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై గ్రేటర్ సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజల రక్షణ మాకు ముఖ్యం.
 
 అందుకోసం కచ్చితమైన హామీ కావాలి. సీడబ్ల్యూసీ చేసిన తెలంగాణ తీర్మానాన్ని గౌరవిస్తున్నామే తప్ప యూటీ చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేస్తే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. 28న గ్రేటర్ మంత్రులు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిసి అన్ని విషయాలపై మాట్లాడతారు’’అని చెప్పారు. ఈ ప్రతిపాదనపట్ల హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే తాము చేసే ప్రతిపాదనవల్ల హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర నేతల ఆందోళనను హైకమాండ్ పెద్దలు అర్థం చేసుకుని తగిన విధంగా గట్టి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement