రాష్ట్ర విభజన నిర్ణయంపై స్పష్టమైన సమాధానం చెప్పలేక ప్రజాప్రతినిధులు ప్రజల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు.
మంత్రిగారూ.. ఇంత చాటేలా!
Sep 15 2013 3:59 AM | Updated on Sep 1 2017 10:43 PM
నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయంపై స్పష్టమైన సమాధానం చెప్పలేక ప్రజాప్రతినిధులు ప్రజల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఒకవేళ పనిమీద పట్టణానికి వచ్చినా హడావిడి లేకుండా సెలైంట్‌గా వచ్చి పని ముగించుకుని చల్లగా జారుకుంటున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ శనివారం నరసాపురానికి చాటుగా వచ్చి.. సమైక్యవాదులకు కనిపించకుండా సెలైంట్‌గా వెళ్లిపోయారు. పట్టణంలోని పొన్నపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ వల్లభూని లక్ష్మణరావు ఇటీవల మృతి చెందారు.
ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మంత్రి పట్టణానికి వచ్చారు. ఎప్పుడూ అంబేద్కర్ సెంటర్ నుంచి పట్టణానికి వచ్చే ఆయన అక్కడ సమైక్యవాదులు అడ్డుకుంటారేమోనని, చుట్టూతిరిగి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా అదే మార్గంలో వెళ్లిపోయారు. బుగ్గకారు సెరైన్ గాని, ఇతర హడావిడి గానీ లేకుండా పితాని జాగ్రత్తపడ్డారు. మంత్రి రాక విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా బయటకు పొక్కనీయలేదు. మంత్రి తీరుపై సమైక్య వాదులు మండిపడుతున్నారు. ప్రజలకు దొరక్కుండా ఇంకెంత కాలం ఇలా తిరగగలరని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
Advertisement
Advertisement