రియల్‌ఎస్టేట్‌ మోసాలకు ‘రెరా’ రెడ్‌ లైన్‌ | RERA Telangana Chairman Satyanarayana Sakshi Interview | Sakshi
Sakshi News home page

రియల్‌ఎస్టేట్‌ మోసాలకు ‘రెరా’ రెడ్‌ లైన్‌

Jun 7 2025 3:24 PM | Updated on Jun 7 2025 5:26 PM

RERA Telangana Chairman Satyanarayana Sakshi Interview

కొనుగోలుదారులను మోసం చేస్తే కఠినచర్యలు

ప్రీలాంచ్‌లు, అనుమతిలేని ప్రకటనలు చట్ట విరుద్ధం

మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు రిజిస్టర్‌

2,198 ఫిర్యాదులు వస్తే.. 1,278 పరిష్కరించాం

రూ.42 కోట్ల జరిమానా విధించి.. రూ.15 కోట్లు వసూలు చేశాం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో రెరా చైర్మన్‌ సత్యనారాయణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుదారుల ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్టర్లు కొనుగోలుదారులను మోసగించే చర్యలను సహించేది లేదని రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌ సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రూ.42 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

2023 జూన్‌లో రెరాకు పూర్తిస్థాయిలో చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యనారాయణ వివరించారు. 500 చదరపు అడుగులకు పైబడిన లేదా కనీసం తొమ్మిది.. అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు, ప్లాట్లు నిర్మించే ప్రతి ప్రాజెక్టు ‘రెరా’కింద రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. అనుమతుల సమయంలో హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాలు, సంస్థలు కూడా విధిగా ‘రెరా’రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రమోటర్లు, డెవలపర్లకు సూచిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..  

రెరాలో ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయి? 
ఈ ఏడాది మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 4,237 వ్యక్తులు/సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు.

రెరా ప్రధాన బాధ్యతలేంటి? 
ప్రమోటర్లు, డెవలపర్లు కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేలా చేయడం, న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూడడం, పారదర్శకత నెలకొల్పి మోసాలను నివారించడం, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు సకాలంలో ప్రాపర్టీలను పూర్తిచేసి అందించేలా చూడడం, ఒప్పందాలు సరిగా అమలయ్యేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెరా ప్రధాన బాధ్యతలు.  

ప్రజల నుంచి రెరాకు ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? 
ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను అప్పగించటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవటం, లేఅవుట్‌ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ సమయంలో అభివృద్ధి చేయకపోవడం, అ సంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను రిజిస్టర్‌ చేయడం, నిధు లను మళ్లించడం, కొనుగోలుదారుల నుంచి వసూ లు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడం, అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు వసతులు కల్పించకపోవడం, ఒకే ప్లాట్‌/ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, వినియోగదారుల నుంచి డబ్బు వసూ లు చేసి కనిపించకుండా పోవటం, రెరాలో రిజిస్టర్‌ చేసుకోని ఏజెంట్లు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడంపై ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి.

రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు వస్తున్నాయి. వాటికి చెక్‌పెట్టే విధానం ఉందా? 
రిజిస్టర్‌ చేసుకోని ప్రాజెక్టులపై సుమోటోగా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రమోటర్ల అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించి రిజిస్టర్‌ చేసుకోని ప్రాజెక్టులను గుర్తించి షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నాం. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిస్తే.. 040–29394972కు ఫోన్‌ చేసిగానీ, 9000006301 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా గానీ,  rera&maud@telangana.gov.in, secy&rera&maud@telangana.gov.in వెబ్‌సైట్లలోగానీ ఫిర్యాదు చేయవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై ప్రీ లాంచింగ్‌ కార్యక్రమాలు చేపట్టడం రెరా చట్టరీత్యా నేరం. రిజిస్టర్‌ చేసుకోని సంస్థల ప్రకటనలను నియంత్రించేందుకు రెరా త్వరలోనే అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది.  

ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? అందులో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? చర్యల తరువాత సంస్థల తీరు మారిందా? మీ నిర్ణయాలపై అప్పిలేట్‌కు వెళ్లిన కేసులెన్ని? 
2,198 ఫిర్యాదులు అందాయి. వాటిలో 1,278 ఫి ర్యాదులను పరిష్కరించాం. 862 ప్రాజెక్టులపై జరిమానాలు విధించాం. 42 కేసుల్లో అప్పీల్‌కు వెళ్లారు.

ఇప్పటివరకు ఎంత జరిమానా విధించారు? అందులో సంస్థలు ఎంత చెల్లించాయి? 
నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.41,04,09,425 జరిమానా విధించాం. అందులో రూ.15,76,82,170 వసూలు అయ్యింది.  

వసూలు కాని జరిమానాను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? 
92 కేసుల్లో రెవెన్యూ రికవరీ చట్టం కింద జరినామాలు వసూలు చేయాలని హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను కోరాం. అందులో 3 కేసుల్లో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద జరిమానాలు వసూలు చేశారు. మిగతావి కూడా త్వరలో వసూలు చేస్తాం.

రియల్‌ ఎస్టేట్‌ మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
రియల్‌ ఎస్టేట్‌ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్‌ ఫోరం, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహకారంతో రియల్‌ మోసాలను అరికట్టే చర్యలు చేపట్టాం.  

రెరా అమలులో ఇతర రాష్ట్రాలు ఏవిధంగా ముందుకెళ్తున్నాయి? 
మన రాష్ట్రంలో రెరా పర్మనెంట్‌ అథారిటీని ప్రారంభించి రెండేళ్లు అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ముందునుంచే ఉన్నా యి. అయినా వాటితో సమానంగా మన దగ్గర రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో రెరాను 2017లోనే ప్రారంభించారు. మన రాష్ట్రంలో రెరా చైర్మన్‌గా నన్ను, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణను 2023 జూలైలో నియమిస్తే.. సిబ్బందిని 2024 నవంబర్‌లో కేటాయించారు. సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలతో కలిసి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement