మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు ఈనెల 19 తేదీ నుంచి రోడ్డెక్కనున్నారు. ఓవైపు పెరిగిన నిత్యావసర ధరలవల్ల బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు ఈనెల 19 తేదీ నుంచి రోడ్డెక్కనున్నారు. ఓవైపు పెరిగిన నిత్యావసర ధరలవల్ల బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
వైఎస్ వరం.. కిరణ్ శాపం..
ప్రభుత్వ పాఠశాలల్లో భోజన వసతి కల్పించి విద్యనందించాలని కేంద్రం 1 నుంచి 8 వతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు కేంద్రం 75 శాతం నిధులను రాష్ట్రం 25 శాతం నిధులను వెచ్చిస్తుంది. దీంతో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 9,10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం అందించాలని నిర్ణయించారు.
జిల్లాలో 9,10 తరగతులకు చెందిన విద్యార్థులు 48,963 మంది ఉన్నారు. వీరికి రోజూ భోజనాన్ని పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఏజెన్సీ సభ్యులే అందిస్తున్నారు. వైస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిధులు సక్రమంగానే విడుదల అయ్యాయి. ఆయన మరణానంతరం బడ్జెట్ నిలిచిపోయింది. 2010 సంవత్సరం నుంచి బకాయిలు ఉండిపోయాయి. నేటి వరకు జిల్లాకు 9,10 తరగతుల విద్యార్థులు భోజనం బకాయిలు రూ. 4.16 కోట్లు రావాల్సి ఉండగా కిరణ్ ప్రభుత్వం బకాయిలపై స్పందించడం లేదు. దీంతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు.
పెరిగిన ధరలతో సతమతం..
పెరిగిన నిత్యావసర ధరలతో భోజన కార్మికులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ధరల కంటే మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1,36,607 మంది విద్యార్థులు ఉన్నారు. 6 నుంచి 8 తరగతి వరకు 74,710 మంది విద్యార్థులు ఉన్నారు. 2,347 పాఠశాలల్లో భోజనం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి 1 నుంచి 5 తరగతి వరకు రూ.4.30, 6నుంచి 10 తరగతి వరకు రూ. 6 ప్రభుత్వం అందిస్తుంది. కానీ నేడు పెరిగిన ధరల వల్ల ఒక్కో విద్యార్థికి రూ. 8 10 తరగతి విద్యార్థులకు రూ.12 వరకు ఖర్చు అవుతోంది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వారానికి రెండు రోజులు కోడిగుడ్లు పెట్టాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన బడ్జెట్‌లోనే కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు రూ. 5 పైబడి ఉంది. దీంతో ఒక్కరోజు బడ్జెట్ కోడిగుడ్లకే సరిపోతోంది. దీనివల్ల నిర్వాహకులు బడ్జెట్ సరిపోక ఇబ్బంది పడుతున్నారు.
త్వరలోనే వస్తాయి
త్వరలోనే బకాయిలు అందిస్తాం. వారం రోజుల క్రితమే ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. అందులో మధ్యాహ్న భోజన ఏజెన్సీల బకాయిలపై చర్చ జరిగింది. కొన్ని రోజుల్లోనే బకాయిలు విడుదల కావచ్చు.
-శ్రీనివాసాచారి, డీఈఓ