breaking news
Mid-Day Meal agency
-
ఆకలేస్తోంది..
ఆత్మకూరు : తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చినందున తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ తమకప్పగించాలంటూ తోపుదుర్తి గ్రామంలో తెలుగుతమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. మెనూ ప్రకారం వంట చేస్తూ వస్తున్న తాము ఎందుకు తప్పుకోవాలని నిర్వాహకురాలు ప్రశ్నించినందుకు వంటగది, సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్‌కు తాళాలు వేసుకుని వెళ్లారు. టీడీపీ నేతల నిర్వాకం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. లక్ష్మినరసింహ ఏజెన్సీ పేరిట అనురాధ అనే మహిళ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితురాలైన ఈమె ఇప్పటి వరకూ మెనూ ప్రకారం వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మధ్యాహ్న భోజనం ఏజెన్సీపై కన్నేశారు. ఈ మేరకు ఈ నెల మూడో తేదీన ఉన్నతపాఠశాలకు వెళ్లి ‘ఇకపై మీరు వంట చేయక్కర్లేదు. మేమే మధ్యాహ్న భోజనం నిర్వహిస్తాం. ఇందుకు సమ్మతం తెలపండి’ అని ఏజెన్సీ నిర్వాహకురాలు అనురాధకు హుకుం జారీ చేశారు. తహశీల్దార్ నుంచి అనుమతి పొంది ఉంటే మీరే వంట చేయండని ఆమె తెలపగా... టీడీపీ కార్యకర్తలు వినకుండా వంట చేస్తున్న సమయంలోనే పొయ్యిలోకి నీరు పోసి ఆర్పేశారు. అంతటితో ఆగక వంటగది, బియ్యం, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచిన స్టోర్ రూమ్‌కు తాళాలు వేసి వెంట తీసుకెళ్లారు. జరిగిన సంఘటనపై అనురాధ తహశీల్దార్‌కు ఫోన్లో సమాచారమందించారు. నాలుగో తేదీన తాళం పగులగొట్టి..వంట చేస్తామని అనురాధ బంధువులు ప్రధానోపాధ్యాయుడిని కోరగా.. తనకు ఆ అధికారాలు లేవన్నారు. దీంతో అదేరోజు సాయంత్రం వారు తహశీల్దార్‌కు, పోలీస్‌స్టేషన్‌కు అర్జీలు సమర్పించారు. ఐదో తేదీన ఉదయం టీడీపీ కార్యకర్తలు తాము వంట చేస్తామని రాగా... తహశీల్దార్ నుంచి ఉత్తర్వులు తీసుకొస్తే వంట చేయడానికి తమకెటువంటి అభ్యంతరమూ లేదని హెచ్ఎం స్పష్టం చేశారు. ఏజెన్సీ నిర్వహణ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక.. ఆకలితో పస్తులు ఉండలేక విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఐదు రోజులుగా తాళం తీయకపోవడంతో కూరగాయలు పాడైపోయాయి. అధికారులే సమస్య పరిష్కరించాలి మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై తహశీల్దార్‌కి అర్జీ ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్మానిటరింగ్ కమిటీ చైర్మన్, సభ్యులతో సమావేశమై తహశీల్దార్, మండల అభివృద్ది అధికారి, పోలీసు అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు కలిసి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ సమస్యను పరిష్కరించాలి. - రమేష్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, తోపుదుర్తి -
భోజనం బంద్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు ఈనెల 19 తేదీ నుంచి రోడ్డెక్కనున్నారు. ఓవైపు పెరిగిన నిత్యావసర ధరలవల్ల బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వైఎస్ వరం.. కిరణ్ శాపం.. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన వసతి కల్పించి విద్యనందించాలని కేంద్రం 1 నుంచి 8 వతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు కేంద్రం 75 శాతం నిధులను రాష్ట్రం 25 శాతం నిధులను వెచ్చిస్తుంది. దీంతో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 9,10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం అందించాలని నిర్ణయించారు. జిల్లాలో 9,10 తరగతులకు చెందిన విద్యార్థులు 48,963 మంది ఉన్నారు. వీరికి రోజూ భోజనాన్ని పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఏజెన్సీ సభ్యులే అందిస్తున్నారు. వైస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిధులు సక్రమంగానే విడుదల అయ్యాయి. ఆయన మరణానంతరం బడ్జెట్ నిలిచిపోయింది. 2010 సంవత్సరం నుంచి బకాయిలు ఉండిపోయాయి. నేటి వరకు జిల్లాకు 9,10 తరగతుల విద్యార్థులు భోజనం బకాయిలు రూ. 4.16 కోట్లు రావాల్సి ఉండగా కిరణ్ ప్రభుత్వం బకాయిలపై స్పందించడం లేదు. దీంతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. పెరిగిన ధరలతో సతమతం.. పెరిగిన నిత్యావసర ధరలతో భోజన కార్మికులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ధరల కంటే మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1,36,607 మంది విద్యార్థులు ఉన్నారు. 6 నుంచి 8 తరగతి వరకు 74,710 మంది విద్యార్థులు ఉన్నారు. 2,347 పాఠశాలల్లో భోజనం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి 1 నుంచి 5 తరగతి వరకు రూ.4.30, 6నుంచి 10 తరగతి వరకు రూ. 6 ప్రభుత్వం అందిస్తుంది. కానీ నేడు పెరిగిన ధరల వల్ల ఒక్కో విద్యార్థికి రూ. 8 10 తరగతి విద్యార్థులకు రూ.12 వరకు ఖర్చు అవుతోంది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వారానికి రెండు రోజులు కోడిగుడ్లు పెట్టాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన బడ్జెట్లోనే కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు రూ. 5 పైబడి ఉంది. దీంతో ఒక్కరోజు బడ్జెట్ కోడిగుడ్లకే సరిపోతోంది. దీనివల్ల నిర్వాహకులు బడ్జెట్ సరిపోక ఇబ్బంది పడుతున్నారు. త్వరలోనే వస్తాయి త్వరలోనే బకాయిలు అందిస్తాం. వారం రోజుల క్రితమే ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. అందులో మధ్యాహ్న భోజన ఏజెన్సీల బకాయిలపై చర్చ జరిగింది. కొన్ని రోజుల్లోనే బకాయిలు విడుదల కావచ్చు. -శ్రీనివాసాచారి, డీఈఓ