డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి– మైలారం వాగులో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో.. అందులోని యువకుడు గుండ బాలచందర్ (23) మృతి చెందాడు. ఎస్‌ఐ మహ్మద్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. దర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన బాలచందర్ డీజే నిర్వహించేవాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడి కారు తీసుకుని బయటకు వెళ్లాడు. కొరట్‌పల్లి గ్రామం నుంచి రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో కారులో మైలారం గ్రామానికి బయల్దేరాడు. రెండు గ్రామాల మధ్య వాగు వంతెన పైనుంచి వెళ్తుండగా.. అదుపు తప్పిన కారు వాగు నీటిలో బోల్తా పడింది.
రాత్రి సమయం కావడం, ఎవరూ చూడకపోవడంతో కారులోని బాలచందర్ అందులోనుంచి బయటపడలేక మృతి చెందాడు. వంతెనకు పైన చెక్ డ్యాం ఉండటంతో నీళ్లు ఎక్కువగా ఉన్నా యి. సోమవారం ఉదయం కొరట్‌పల్లి గ్రామస్తులు కొందరు వాగు వంతెన పై నుంచి వెళ్తుండగా.. నీటిలో కారును చూసి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో మైలారం గ్రామస్తులు కూడా వాగు వద్దకు చేరుకున్నారు. పోలీసులు జేసీబీతో నీటిలో నుంచి కారును బయటకు తీయగా.. అందులో నుంచి బాలచందర్ మృతదేహం బయటపడింది. మృతుని తండ్రి కిషన్ గతంలోనే చనిపోయాడు.


