చంద్రబాబుకు అవకాశం ఇవ్వొద్దు

Mekapati Rajamohan Reddy Comments On Chandrababu Naidu - Sakshi

పార్టీ విజయానికి బూత్‌ కమిటీలే కీలకం 

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి   

ఇందుకూరుపేట: రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు గెలిచే అవకాశం ఇవ్వరాదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని డేవిస్‌పేట జైన్‌ మందిరంలో శనివారం బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి రాజమోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

రానున్న ఎన్నికలు అత్యంత కీలమైనవని, ఈ ఎన్నికల్లో బూత్‌కమిటీలదే ముఖ్యభూమిక అని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేయడం వల్ల ఓ చిన్న వ్యక్తికి వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశం లేదని బాబు చెబుతున్నారని, బహుశా రాçష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటారేమో అర్థం కావడం లేదన్నారు. దేశంలో రాష్ట్రం ఓ భాగమని, కేంద్ర ప్రభుత్వం అలాగే చూడాల్సి ఉందన్నారు. బీజేపీతో కాపురం చేసి గ్రాఫ్‌ తగ్గుతుందని బయటకు వచ్చి ఇప్పుడు  కేకలు వేస్తున్నారని దుయ్యబట్టారు.

 తాజాగా కాంగ్రెస్‌తో జట్టు కట్టిన చంద్రబాబు ఎంత అవకాశవాదో తెలుస్తోందన్నారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయని, అందరం కలసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి చివర్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. టీడీపీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి కోర్టు సీబీఐ ఎంక్వయిరీ వేస్తుందని తాను నమ్ముతున్నానన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రం పనులను రాష్ట్రానివిగా డప్పు
ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పనులను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా డప్పుకొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీలకు వస్తాయన్నారు. కేంద్రం నిధులతో శ్మశానాల అభివృద్ధి, ఎన్‌ఆర్‌జీఈఎస్‌తో సిమెంట్‌ రోడ్లు వేసి వాటిని ఎమ్మెల్యేలు ప్రారంభించి కోట్ల రూపాయల పనులు చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. బీజేపీ నాయకులు వారు చేసిన పనులను చెప్పులేకపోతున్నారన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మాట్లాడి బీచ్‌ రిసార్ట్స్‌కు రూ.60 కోట్లు తీసుకొచ్చారన్నారు.

 ఇవి కూడా రాష్ట్రం  ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెబుతున్నారన్నారు. వీటిలో కోవూరు నియోజకవర్గానికి రూ.14 కోట్లు కేటాయించారని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి, జెడ్పీటీసీ బీవీ రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధీర్‌కుమార్, నియోజకవర్గ బూత్‌కమిటీ ఇన్‌చార్జ్‌ ఎన్‌.సుధాకర్‌బాబు, బూత్‌కమిటీ మండల ఇన్‌చార్జ్‌ తాతా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top