విటమిన్‌ టాబ్లెట్లకు గిరాకీ

Many People Are Using Vitamin Tablets In Fear of Coronavirus - Sakshi

ఈ మాత్రలు కరోనాను ఎదుర్కోగలవని నమ్మకం

ఆహారం ద్వారా లభించే విటమిన్లే మంచివంటున్న వైద్యులు

సాక్షి, అమరావతి: కరోనా తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు. దీని బారినుంచి తప్పించుకునేందుకు చాలామంది విటమిన్‌ టాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు. గడచిన రెండు నెలలుగా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. కొంతమంది వైద్యులతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్లు పుష్కలంగా తీసుకోవాలనే ప్రచారం సాగుతుండటంతో ఎవరికి వారు రెండు మూడు నెలలకు సరిపడా విటమిన్‌ మాత్రలను స్టాకు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే.. 70 శాతం షాపుల్లో విటమిన్‌ మాత్రల కొరత ఉన్నట్టు తేలింది. దీనిని ఆసరా చేసుకుని కొన్నిచోట్ల వీటిని ఎక్కువ ధరకు అమ్ముతున్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి.

ఈ మాత్రలకు డిమాండ్‌
► విటమిన్‌ డీ–3 మాత్రలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. జింకోవిట్‌ మాత్రలకూ ఎగబడుతున్నారు.  
► బీ.కాంప్లెక్స్‌ టాబ్లెట్లను సైతం బాగా కొంటున్నారు. నిమ్మ, నారింజ పండ్ల ద్వారా లభించే సీ విటమిన్‌ కోసం కూడా మాత్రలనే వాడుతున్నారు. 
► పారాసెటిమాల్, అజిత్రోమైసిన్‌ టాబ్లెట్లకూ గిరాకీ ఏర్పడింది.  
► ఈ పరిస్థితుల్లో కొన్ని ఊరూపేరూ లేని కంపెనీలు కూడా విటమిన్‌ మాత్రల్ని తెస్తున్నాయని ఫార్మసీ యజమానులు చెబుతున్నారు.

వైద్యులు ఏమంటున్నారంటే.. 
► విటమిన్‌ మాత్రల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సహజ సిద్ధంగా తినే ఆహారం నుంచి వచ్చే విటమిన్లే శరీరానికి మంచివి. 
► చికిత్స పొందుతున్న పేషెంట్లు ఆహారం తీసుకోలేరు కాబట్టి మందులు ఇవ్వాల్సి వస్తుంది. 
► పండ్లు, ఆకు కూరల ద్వారా అన్నిరకాల విటమిన్లు లభిస్తాయి. ఆహారం ద్వారా లభించే విటమిన్లను శరీరం బాగా ఇముడ్చుకోగలదు.

ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు 
గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కు మించి ఎక్కడా ఒక్క పైసా కూడా ఎక్కువ ధర వసూలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తున్నారని ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
– రాజభాను, అసిస్టెంట్‌ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top