breaking news
vitamin d3
-
వృద్ధాప్యాన్ని డీ కొట్టొచ్చు!?
టీవీలో సంతూర్ సబ్బు ప్రకటన గుర్తుందా.. ఓ పాప మమ్మీ అంటూ పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు రావడం.. బిడ్డకు తల్లి అయినా వయసు కనిపించడం లేదన్నట్టు ఆ నటుడు ఆశ్చర్యపోవడం! వయసును ఓడించడం ప్రకటనల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సాధ్యమేనట! విటమిన్ డి సప్లిమెంట్లను నిత్యం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యం దరిచేరదని తాజా పరిశోధనలో తేలింది.ప్రతిరోజూ 2,000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) మోతాదులో విటమిన్ –డీ3 తీసుకుంటే ‘టెలొమియర్స్’ ఆరోగ్యంగా ఉంటాయని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. పరిశోధకులు మొత్తం 1,054 మందిపై 5 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. వీరిలో 55 ఏళ్లకుపైబడిన మహిళలు, 50–55 ఏళ్ల పురుషులు ఉన్నారు. పరిశోధన ప్రారంభంలో, అలాగే రెండు, నాలుగు సంవత్సరాల తర్వాత వారి టెలొమియర్స్ను కొలిచారు. సగం మందికి రోజుకు 2,000 ఐయూ విటమిన్–డీ3∙ఇచ్చారు. మిగిలిన సగం మందికి ఎలాంటి విటమిన్ ఇవ్వలేదు. విటమిన్–డి గ్రూపులోని వ్యక్తుల్లో టెలొమియర్స్ సురక్షితంగా ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. విటమిన్ –డీ ఎందుకంటే..ఎముకల ఆరోగ్యానికి విటమిన్–డీ చాలా అవసరమని అందరికీ తెలిసిందే. ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎముకలు దృఢంగా తయారు కావడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ తగినంత స్థాయిలో అవసరం. రోగనిరోధక వ్యవస్థను సైతం ఇది బలంగా చేస్తుంది. విటమిన్–డి సప్లిమెంట్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించగలవని అధ్యయనంలో తేలింది. రుమటాయిడ్ ఆర్రై్థటిస్, కణజాలాలు గట్టిపడడం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరంలోని వాపు ఉంటే టెలొమియర్స్ను దెబ్బతీస్తుంది. ఆ వాపును విటమిన్–డి తగ్గిస్తుంది.ఇంతకీ మోతాదు ఎంత?విటమిన్ –డి ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హార్వర్డ్ పరిశోధకులు రోజుకు 2,000 ఐయూ మోతాదు ఉపయోగించారు. 70 ఏళ్లలోపు వారికి 600 ఐయూ, ఆపైబడి వయసున్న వృద్ధులకు సిఫార్సు చేసిన 800 ఐయూ కంటే ఇది చాలా ఎక్కువ మోతాదు. అయితే ఇతర పరిశోధనలు కేవలం 400 ఐయూ మోతాదులో రోజూ తీసుకుంటే జలుబును నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న విటమిన్–డి స్థాయిలు, మొత్తం పోషకాహారం, ఇతర పోషకాలతో ఈ విటమిన్ ఎలా కలిసిపోతుందో వంటి అంశాలపై ‘సరైన మోతాదు’ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తొందరపాటు చర్య!తాజా పరిశోధనలు ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ.. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే ఆశతో అధిక మోతాదులో విటమిన్–డి తీసుకోవడం తొందరపాటు చర్యగా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కంటి నిండా నిద్ర, ధూమపానం చేయకపోవడం, ఒత్తిడిని జయించడం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయన్నది వారి మాట. ఇవన్నీ సహజంగా టెలొమియర్స్ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. అయితే విటమిన్–డి లోపం ఉన్నా, ఎముకల ఆరోగ్యం సరిగా లేకున్నా సప్లిమెంట్లు తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల నుంచి వచ్చే ఆహారాల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు తగ్గించే) సమ్మేళనాలు టెలొమియర్స్ను ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో చేపట్టిన పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), సామాజిక సత్సంబంధాలు కూడా టెలొమియర్స్ను రక్షించడంలో సహాయపడతాయి. సూర్యరశ్మితోనే..: ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కండరాల పనితీరు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకం విటమిన్ డి. ఇది సూర్యరశ్మి నుంచే 80 శాతం వరకు లభిస్తుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
విటమిన్ టాబ్లెట్లకు గిరాకీ
సాక్షి, అమరావతి: కరోనా తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు. దీని బారినుంచి తప్పించుకునేందుకు చాలామంది విటమిన్ టాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు. గడచిన రెండు నెలలుగా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. కొంతమంది వైద్యులతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్లు పుష్కలంగా తీసుకోవాలనే ప్రచారం సాగుతుండటంతో ఎవరికి వారు రెండు మూడు నెలలకు సరిపడా విటమిన్ మాత్రలను స్టాకు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే.. 70 శాతం షాపుల్లో విటమిన్ మాత్రల కొరత ఉన్నట్టు తేలింది. దీనిని ఆసరా చేసుకుని కొన్నిచోట్ల వీటిని ఎక్కువ ధరకు అమ్ముతున్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి. ఈ మాత్రలకు డిమాండ్ ► విటమిన్ డీ–3 మాత్రలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. జింకోవిట్ మాత్రలకూ ఎగబడుతున్నారు. ► బీ.కాంప్లెక్స్ టాబ్లెట్లను సైతం బాగా కొంటున్నారు. నిమ్మ, నారింజ పండ్ల ద్వారా లభించే సీ విటమిన్ కోసం కూడా మాత్రలనే వాడుతున్నారు. ► పారాసెటిమాల్, అజిత్రోమైసిన్ టాబ్లెట్లకూ గిరాకీ ఏర్పడింది. ► ఈ పరిస్థితుల్లో కొన్ని ఊరూపేరూ లేని కంపెనీలు కూడా విటమిన్ మాత్రల్ని తెస్తున్నాయని ఫార్మసీ యజమానులు చెబుతున్నారు. వైద్యులు ఏమంటున్నారంటే.. ► విటమిన్ మాత్రల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సహజ సిద్ధంగా తినే ఆహారం నుంచి వచ్చే విటమిన్లే శరీరానికి మంచివి. ► చికిత్స పొందుతున్న పేషెంట్లు ఆహారం తీసుకోలేరు కాబట్టి మందులు ఇవ్వాల్సి వస్తుంది. ► పండ్లు, ఆకు కూరల ద్వారా అన్నిరకాల విటమిన్లు లభిస్తాయి. ఆహారం ద్వారా లభించే విటమిన్లను శరీరం బాగా ఇముడ్చుకోగలదు. ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కు మించి ఎక్కడా ఒక్క పైసా కూడా ఎక్కువ ధర వసూలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తున్నారని ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజభాను, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ -
‘డి2’.. ‘డి3’ ఏది బెస్ట్
ఆరోగ్యం కోసం విటమిన్లు అవసరం. మొక్కల నుంచి సేకరించిన విటమిన్ ‘డి’కన్నా జంతు ఉత్పత్తుల నుంచి సేకరించిన విటమిన్ ‘డి’ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండింటితో కలిగే ప్రయోజనం ఒకేతీరుగా ఉంటుందన్న ప్రస్తుత అంచనా సరికాదని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సర్రే శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవ్వాలన్నా.. ఎముకలను గట్టిపరిచే కాల్షియం శరీరానికి ఒంట బట్టాలన్నా విటమిన్ డి తప్పనిసరి. అయితే శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారు చేసుకోలేదు. సూర్యరశ్మి ద్వారా చర్మంలోని కణాలు విటమిన్ ‘డి3’ని తయారు చేస్తే అదికాస్తా కాలేయం.. మూత్రపిండాల్లోకి చేరి విటమిన్‘డి’గా మారుతుంది. అయితే కొన్ని మాంస ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి3’, శాకాహార ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి2’ రూపంలో లభిస్తుంది ఇది. ఈ నేపథ్యంలో ‘డి2’ కన్నా ‘డి3’ వల్లే శరీరానికి మేలెక్కువని ఓ పరిశోధన ద్వారా సర్రే శాస్త్రవేత్తలు తేల్చారు. దక్షిణాసియాకు చెందిన దాదాపు 335 మందిపై పరిశోధనలు జరిపారు. ‘డి3’ అందించిన వారిలో విటమిన్ ‘డి’దాదాపు 75% ఎక్కువ కాగా.. ‘డి2’ తీసుకున్న వారిలో 34% మాత్రమే ఉందని గుర్తించారు.