
2,000 ఐయూ మోతాదులో విటమిన్ –డి3
రోజూ తీసుకుంటే యవ్వనంతో ఉండొచ్చు
హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడి
టీవీలో సంతూర్ సబ్బు ప్రకటన గుర్తుందా.. ఓ పాప మమ్మీ అంటూ పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు రావడం.. బిడ్డకు తల్లి అయినా వయసు కనిపించడం లేదన్నట్టు ఆ నటుడు ఆశ్చర్యపోవడం! వయసును ఓడించడం ప్రకటనల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సాధ్యమేనట! విటమిన్ డి సప్లిమెంట్లను నిత్యం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యం దరిచేరదని తాజా పరిశోధనలో తేలింది.
ప్రతిరోజూ 2,000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) మోతాదులో విటమిన్ –డీ3 తీసుకుంటే ‘టెలొమియర్స్’ ఆరోగ్యంగా ఉంటాయని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైంది. పరిశోధకులు మొత్తం 1,054 మందిపై 5 ఏళ్లపాటు అధ్యయనం చేశారు.
వీరిలో 55 ఏళ్లకుపైబడిన మహిళలు, 50–55 ఏళ్ల పురుషులు ఉన్నారు. పరిశోధన ప్రారంభంలో, అలాగే రెండు, నాలుగు సంవత్సరాల తర్వాత వారి టెలొమియర్స్‌ను కొలిచారు. సగం మందికి రోజుకు 2,000 ఐయూ విటమిన్–డీ3∙ఇచ్చారు. మిగిలిన సగం మందికి ఎలాంటి విటమిన్ ఇవ్వలేదు. విటమిన్–డి గ్రూపులోని వ్యక్తుల్లో టెలొమియర్స్ సురక్షితంగా ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి.
విటమిన్ –డీ ఎందుకంటే..
ఎముకల ఆరోగ్యానికి విటమిన్–డీ చాలా అవసరమని అందరికీ తెలిసిందే. ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎముకలు దృఢంగా తయారు కావడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ తగినంత స్థాయిలో అవసరం. రోగనిరోధక వ్యవస్థను సైతం ఇది బలంగా చేస్తుంది. విటమిన్–డి సప్లిమెంట్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించగలవని అధ్యయనంలో తేలింది. రుమటాయిడ్ ఆర్రై్థటిస్, కణజాలాలు గట్టిపడడం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరంలోని వాపు ఉంటే టెలొమియర్స్‌ను దెబ్బతీస్తుంది. ఆ వాపును విటమిన్–డి తగ్గిస్తుంది.
ఇంతకీ మోతాదు ఎంత?
విటమిన్ –డి ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హార్వర్డ్ పరిశోధకులు రోజుకు 2,000 ఐయూ మోతాదు ఉపయోగించారు. 70 ఏళ్లలోపు వారికి 600 ఐయూ, ఆపైబడి వయసున్న వృద్ధులకు సిఫార్సు చేసిన 800 ఐయూ కంటే ఇది చాలా ఎక్కువ మోతాదు. అయితే ఇతర పరిశోధనలు కేవలం 400 ఐయూ మోతాదులో రోజూ తీసుకుంటే జలుబును నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న విటమిన్–డి స్థాయిలు, మొత్తం పోషకాహారం, ఇతర పోషకాలతో ఈ విటమిన్ ఎలా కలిసిపోతుందో వంటి అంశాలపై ‘సరైన మోతాదు’ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తొందరపాటు చర్య!
తాజా పరిశోధనలు ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ.. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే ఆశతో అధిక మోతాదులో విటమిన్–డి తీసుకోవడం తొందరపాటు చర్యగా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కంటి నిండా నిద్ర, ధూమపానం చేయకపోవడం, ఒత్తిడిని జయించడం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయన్నది వారి మాట. ఇవన్నీ సహజంగా టెలొమియర్స్ ఆరోగ్యానికీ తోడ్పడతాయి.
అయితే విటమిన్–డి లోపం ఉన్నా, ఎముకల ఆరోగ్యం సరిగా లేకున్నా సప్లిమెంట్లు తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల నుంచి వచ్చే ఆహారాల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు తగ్గించే) సమ్మేళనాలు టెలొమియర్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో చేపట్టిన పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), సామాజిక సత్సంబంధాలు కూడా టెలొమియర్స్‌ను రక్షించడంలో సహాయపడతాయి.
సూర్యరశ్మితోనే..: ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కండరాల పనితీరు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకం విటమిన్ డి. ఇది సూర్యరశ్మి నుంచే 80 శాతం వరకు లభిస్తుంది.
– సాక్షి, స్పెషల్ డెస్క్