పాత కక్షలకు వ్యక్తి బలి

Man Brutally Murdered in Kurnool District - Sakshi

ప్యాపిలి: పాతకక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. తొమ్మిదేళ్ల జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్యాపిలిలో శనివారం అర్ధరాత్రి  జరిగిన  హత్య  సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని స్థానిక కుంటగడ్డ వీధిలో నివాసం ఉంటున్న తొండపాడు మధు (35) శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు మధును వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికారు. కొన ఊపిరితో ఉన్న మధును కుటుంబ సభ్యులు డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య ఇంద్రజ, ఇద్దరు కుమారులు,

ఒక  కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ బాబాఫకృద్దీన్, డోన్,  బనగానపల్లె సీఐలు రాజగోపాల్‌ నాయుడు,  శ్రీనివాసులు, ప్యాపిలి, బనగానపల్లె, దేవనకొండ, బేతంచర్ల ఎస్‌ఐలు పీరయ్య, రాకేశ్, గంగాధర్, తిరుపాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  మృతుడి చిన్నాన్న తొండపాడు మద్దయ్య ఫిర్యాదు మేరకు తొండపాడు పాండురంగడు, రామాంజనేయులు, పూజారి సూర్యనారాయణ, ఓబులేసు, మధు, కొండా కొండన్న, పూజారి వెంకటేశ్, పోదొడ్డి శివ, డైలి రామాంజనేయులు, వైటీ చెరువు నాగేంద్ర, పూజారి శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.   

భార్య పచ్చి బాలింత   
మధు, ఇంద్రజ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారం క్రితమే ఇంద్రజ మూడో శిశువుకు  జన్మనిచ్చింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న ఆమెను శనివారమే డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చిన మధు భార్య, పొత్తిళ్లలో ఉన్న చిన్నారితో కొద్దిసేపు గడిపాడు. అనంతరం పట్టణంలో జరుగుతున్న తిరునాలను చూసేందుకు వెళ్లి  తిరిగి వస్తూ దారుణహత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.  

తొమ్మిదేళ్ల తర్వాత ప్రతీకారం..
2009లో పట్టణంలోని స్థానిక శ్రీరామా టాకీస్‌ వద్ద తొండపాడు లక్ష్మీరంగయ్య దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీరంగయ్య, మధు దగ్గరి బంధువులే అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో వైరం ఉంది. లక్ష్మీరంగయ్యకు చెందిన నాటుసారా కుండలను మధు వర్గీయులే ధ్వంసం చేశారన్న నెపంతో అప్పట్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో మధు వర్గీయులు 2009లో లక్ష్మీరంగయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో మధుతో పాటు 16 మంది ముద్దాయిలుగా ఉన్నారు. అయితే గతేడాది డిసెంబర్‌లో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మీరంగయ్య వర్గీయులు మధును హతమార్చేందుకు పథకం పన్నారు. మధు ఇంటికి వెళ్లాలంటే ప్రత్యర్థి పాండురంగడు ఇంటిని దాటుకుని వెళ్లాలి. ఇదే అదనుగా భావించిన దుండగులు  శనివారం రాత్రి తిరునాల నుంచి ఇంటికి వెళ్తున్న మధు  పాండురంగడు ఇంటి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top