దొంగల పాలిట యమపాశం

Locked House Monitoring System Special Story - Sakshi

ఇళ్లకు రక్ష .. లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం

ప్రజల్లో చైతన్యం రావాలంటున్న పోలీసు అధికారులు

మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ కావాలి

పశ్చిమగోదావరి : వ్యక్తిగత పనులపై ఊరు విడిచి వెళ్తున్నారా?.. ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందా? రెండు, మూడు రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నారా? అయితే జర జాగ్రత్త.. అదను కోసం వేచిచూసే దొంగలకు అవకాశం ఇచ్చినట్లే.. మీ ఇల్లు, సొత్తు భద్రంగా ఉంటుందనే భరోసా మీకుందా ? దొంగల భయం ఉంటే.. వెంటనే మీ సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసు అధికారులను సంప్రదించండి. మీ ఇల్లు, ఇంట్లోని సొత్తును భద్రంగా రక్షించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. దొంగల పాలిట యమపాశంలా లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అందుబాటులో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం విధానంతో దొం గల భరతం పట్టే అవకాశం మీచేతుల్లోనే ఉంటుంది.–ఏలూరు టౌన్‌

లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లను దొంగల బారి నుంచి కాపాడుకోవటంతో పాటు, నేరగాళ్లను సులువుగా పట్టుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ కలిగిన వారు ప్లే స్టోర్‌ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏపీ పోలీస్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. ఈ యాప్‌లోకి వెళ్లిన అనంతరం మీ చిరునామా, వివరాలన్నీ నమోదు చేసి రిజిస్టర్‌ చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకూ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లక్షా పదివేల మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. ఏలూరులోనే 24 వేల మంది ఉండగా, త్రీటౌన్‌ పరిధిలో 12 వేల మంది, వన్‌టౌన్‌ పరిధిలో 7 వేల మంది, టూటౌన్‌ పరిధిలో 5 వేల మందికి పైగా నమోదు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పోలీస్‌ శాఖ ఉచితంగా అందిస్తోందని, పోలీస్‌ కంట్రోల్‌ రూంలో ఎస్సై స్థాయి అధికారి ఈ విధానాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా దొంగ ఇంటిలోకి ప్రవేశించి కెమెరాకు కనిపించగానే వెంటనే పోలీసులను అలర్ట్‌ చేస్తుంది. యాప్‌ కలిగిన ఇంటి యజమాని సైతం తన మొబైల్‌లో ఇంటి వద్ద పరిస్థితులను చూసుకునే అవకాశం ఉంది.

దొంగ దొరికిపోయాడు ఇలా
ఈ ఏడాది మార్చి నెలలో ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటనవివరాలు...
ఏలూరు సత్రంపాడు ఐటీఐ కాలేజీ వెనుక ప్రాంతంలో తాడేపల్లిగూడెం కోర్డు ఉద్యోగి వైఎల్‌ఎన్‌ మూర్తి నివాసం ఉంటున్నారు. మూర్తి తన కుటుంబంతో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి దర్శనార్థం వెళ్తూ.. పోలీస్‌ శాఖ ప్రవేశపెట్టిన లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 2018 మార్చి 29న త్రీటౌన్‌ పోలీసులకు తాను తిరుపతి వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారు. త్రీటౌన్‌ ఎస్సై పైడిబాబు ఆధ్వర్యంలో ఆ టెక్నాలజీలో శిక్షణ పొందిన కానిస్టేబుల్‌ మూర్తి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేశారు. ఈ విధానంలో సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావటంతో పాటు, ఎవరైనా తాళాలు పగులగొడితే వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూంలో అలారం మోగుతుంది. 2018 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక దొంగ ప్రవేశించి, లోపల ఏమి ఉన్నాయో వెతుకుతూ ఉన్నాడు. 12.31 నిమిషాలకు పోలీస్‌ కంట్రోల్‌ రూంలో అలారం మోగింది.

వెంటనే అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 12.37 నిమిషాలకు త్రీటౌన్‌ ఎస్సై ఎ.పైడిబాబు, కానిస్టేబుల్‌ సతీష్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే సందర్భంలో వాహనాల శబ్దాలు వినిపించటంతో దొంగ ఇంటి నుంచి బయటకు వచ్చి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దొంగను వెంబడించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రజల్లో చైతన్యం రావాలి
చోరీలకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అనుకూలమైన సమయాన్ని చూసుకుని, ఇళ్లలో యజమానులు లేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు శాఖ అమలు చేస్తోన్న ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను వినియోగించుకుంటే మంచిది. ప్రజల సొత్తుకు రక్షణతో పాటు నేరగాళ్ల ఆట కట్టించే అవకాశం ఉంటుంది. ప్రజల్లో చైతన్యం వస్తే దొంగతనాలను నిలువరించే అవకాశం ఉంటుంది.–ఎన్‌ రాజశేఖర్, ఏలూరు త్రీటౌన్‌ సీఐ

చోరీలకు చెక్‌ పెట్టొచ్చు
దొంగతనాలు నిలువరించాలంటే ప్రజలు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్‌ను వినియోగించాలి. ఊరు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందిస్తే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ యాప్‌కు అనుసంధానం చేయటంతో పాటు, పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ఏదైనా చోరీ జరిగితే వెంటనే దొంగలను పట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. నేరాలను నిరోధించేందుకు ఇదొక అస్త్రంలా ఉపయోగపడుతుంది.       –ఎ పైడిబాబు, ఏలూరు త్రీటౌన్‌ ఎస్‌ఐ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top