అద్దెకు రావలెను !  

Lockdown Effect; Rental Houses Vacant In Vijayawada - Sakshi

బెజవాడలో లాక్‌డౌన్‌ ప్రభావం 

స్వస్థలాలకు కార్మికులు, కూలీలు, చిరుద్యోగులు 

పెద్ద సంఖ్యలో ఖాళీ అయిన ఇళ్లు 

నెలల తరబడి టూలెట్‌ బోర్డులు  

ఈ పరిస్థితి ఎప్పుడూ లేదంటున్న యజమానులు 

అద్దెలకు దిగేవారు లేక బెజవాడలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు బోసిపోతున్నాయి. మూడు నెలల కిత్రం వరకు ఇక్కడ చిన్నపాటి ఇల్లు దొరకడం సైతం గగనమై పోయేది. రోజులు, వారాలకు తరబడి వెతికినా ఫలితం ఉండేది కాదు.. వేల రూపాయలు ఇస్తామన్నా అద్దె ఇల్లు దొరకడం అతికష్టంగా ఉండేది. కానీ నేడు పరిస్థితి తల్లకిందులయింది. రోజుల తరబడి ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి వచ్చేవారే కరువయ్యారు. కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉద్యోగులు, కారి్మకులు, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోవడం, మరలా వచ్చేవారు లేకపోవడంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో చూసినా టూలెట్‌ బోర్డులు కట్టిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అయితే మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్నా.. అద్దె తగ్గించుకునేందుకు యజమానులు ముందుకురాకపోవడం ఇక్కడ కొసమెరుపు..  

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి దిగే వారే కరువయ్యారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మార్చి మూడో వారం నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. పరిశ్రమలు, షాపులు, విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు  ఇలా ఉపాధినిచ్చే అనేక రంగాలు మూతపడ్డాయి. దీంతో వాటిలో ఉపాధి పొందుతున్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన అనేకమంది తాము ఉంటున్న అద్దె ఇళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో బ్యాచిలర్లుగా ఉంటున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు సింగిల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్లు ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి.  ఫలితంగా దాదాపు మూడు నెలల నుంచి నగరంలోని అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం సడలింపులతో పరిశ్రమలు, షాపులు, హోటళ్లు వంటి వివిధ సంస్థలు తెరచుకోవడానికి అనుమతినిచ్చినా అవి పూర్వ స్థితికి చేరుకోలేదు. స్వస్థలాలకు వెళ్లిపోయిన వారు అరకొరగా తప్ప పూర్తిస్థాయిలో వెనక్కి రాలేదు.  

అడిగేవారే కరువయ్యారు.. 
మరోవైపు విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. దాదాపు అన్ని డివిజన్లనూ కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి అద్దె ఇళ్లలో ఉండడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో బెజవాడలో ఎటు చూసినా టు–లెట్‌ బోర్డులు వేలాడదీసిన అద్దె ఇళ్లు అనేకం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అద్దె ఇళ్ల కోసం  గాలించడం ప్రహసనంగా మారేది. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన కొంతమంది రెంటల్‌ ఏజెన్సీలు, బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలోని ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ టు–లెట్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇల్లు కావాలని అడిగే వారే కరువయ్యారని ఇంటి యజమానులు ఆవేదన చెందుతున్నారు.

‘నేను టు–లెట్‌ బోర్డు పెట్టి రెండు నెలలయింది. ఇప్పటివరకు అద్దెకు దిగుతామని ఒక్కరూ వాకబు చేయలేదు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు’ అని సత్యనారాయణపురానికి చెందిన దుర్గా భవానీ అనే ఇంటి యజమానురాలు ‘సాక్షి’తో చెప్పారు. మొగల్రాజపురానికి చెందిన ప్రసాదరావు కూడా మూడు నెలల నుంచి ఖాళీగా ఉన్న తన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి బోర్డు పెట్టారు. కానీ ఆయనదీ అదే పరిస్థితి. ఇలా నగరంలో అనేకమంది ఇంటి యజమానులు అద్దెలకు ఎవరొస్తారా? అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇంటి అద్దెల సొమ్ముతోనే జీవనం సాగించే వారూ ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందోనని వీరు ఆవేదన చెందుతున్నారు.  

అద్దెల తగ్గింపుపై ససేమిరా.. 
నగరంలో ఇంటి అద్దెలు కనీసం రూ.3 వేల నుంచి గరిష్టంగా 20 వేల వరకు ఉన్నాయి. ఇతర పట్టణాలు, నగరాలతో పోల్చుకుంటే విజయవాడలో ఇంటి అద్దెలు ఎక్కువగానే ఉంటున్నాయి. రేకుల షెడ్లకు కూడా రూ.3–4 వేలు వసూలు చేస్తున్నారు. సాదాసీదా డబుల్‌ బెడ్‌రూమ్‌కు కనీసం రూ.10 వేలు అద్దె తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్నా అద్దెలను తగ్గించడానికి మాత్రం చాలామంది యజమానులు ముందుకు రావడం లేదు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top