అక్రమాల గని.. ‘లింగమనేని’

Lingamaneni Estates illegal land grabbing - Sakshi

రాజధాని ప్రాంతంలో ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇష్టారాజ్యం 

టీడీపీ సర్కారు అండతో వందలాది ఎకరాలను కారుచౌకగా కొట్టేసిన వైనం 

అవే భూముల్లో నిబంధనలను అతిక్రమించి విచ్చలవిడిగా నిర్మాణాలు 

చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న తెలుగుదేశం ప్రభుత్వం   

సాక్షి, మంగళగిరి: లింగమనేని... ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు లేరు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నది లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే. ఈ గెస్ట్‌హౌస్‌ యజమానులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చి, ప్రతిఫలంగా తమ విలువైన భూములను రాజధాని భూసమీకరణ నుంచి తప్పించేలా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 1994కు ముందు విజయవాడలో చిన్నస్థాయి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేసే లింగమనేని సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి, రూ.కోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అధికారం అండతో భూములను సొంతం చేసుకోవడంతోపాటు నిబంధనలను బేఖాతర్‌ చేయడం లింగమనేని సంస్థకు పరిపాటిగా మారింది. 

ఏసీసీ భూములతో ప్రారంభం 
గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల పరిధిలోని నిడమర్రు, నంబూరు, కంతేరు, చినకాకాని, కాజా గ్రామాల్లో ఏసీసీ కంపెనీకి చెందిన 148 ఎకరాల భూములున్నాయి. గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూములపై 2001లో లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కన్ను పడింది. వాటిని లింగమనేనికి విక్రయించేందుకు ఏసీసీ కంపెనీ ముందుకు రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అండతో లింగమనేని సంస్థ అధినేత లింగమనేని భాస్కరరావు వీజీటీఎం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని(ఉడా) రంగంలోకి దించారు. ప్రజావసరాల కోసం అంటూ ఏసీసీకి చెందిన భూములను ఉడా సేకరించింది. 2002లో నంబూరు గ్రామానికి చెందిన 69.81 ఎకరాలు, కాజా గ్రామానికి చెందిన 38.47 ఎకరాలు, కంతేరు గ్రామానికి చెందిన 7.63 ఎకరాలను రూ.4.90 కోట్లకు సేకరించింది. 

ఆ భూముల్లో జాతీయ రహదారి వెంట టౌన్‌షిప్‌ నిర్మిస్తామని పేర్కొంది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవే భూములను లింగమనేని సంస్థకు బహిరంగ వేలం పేరుతో విక్రయించింది. బహిరంగ వేలంలో విజయవాడకు చెందిన సహారా ఇండియా కమర్షియల్‌ కార్పొరేట్‌ సంస్థ, గుంటూరుకు చెందిన బీఎన్‌కే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, లింగమనేని సంస్థ పాల్గొన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సహారా, బీఎన్‌కే సంస్థలు వేలం నుంచి తప్పుకున్నాయి. చివరకు లింగమనేని సంస్థ 115.90 ఎకరాలను రూ.8.96 కోట్లకు దక్కించుకుంది. అప్పటికే ఆక్కడ ఎకరం విలువ రూ.40 లక్షలకు పైగానే పలుకుతోంది. ఉడా మాత్రం లింగమనేని సంస్థకు ఎకరా కేవలం రూ.7.75 లక్షల చొప్పున కట్టబెట్టింది. ఏసీసీకి చెందిన భూములు మొత్తం 148 ఎకరాలుండగా, ఉడా 115.90 ఎకరాలను సేకరించి, లింగమనేనికి విక్రయినట్లు చెబుతుండగా మిగిలిన 31.10 ఎకరాల భూమి ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటి విలువ ప్రస్తుతం రూ.450 కోట్ల పైమాటే. 

అక్రమాలను ప్రశ్నించిన  గ్రామ కార్యదర్శి సస్పెండ్‌ 
ఉడా నుంచి నామమాత్రపు ధరకే విలువైన భూములను కొట్టేసిన లింగమనేని సంస్థ అప్పటి టీడీపీ సర్కారు అండతో నిబంధనలకు పాతరేసి, అందులో నిర్మాణాలను ప్రారంభించింది. కామన్‌ సైట్, సెట్‌ బ్యాక్స్‌ వంటి నిబంధనలను పాటించలేదు. దీనిపై నంబూరు గ్రామ కార్యదర్శి అబ్దుల్లా రియల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లింగమనేని ఒత్తిడితో సదరు గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 

పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి 
లింగమనేని అక్రమ నిర్మాణాలపై స్థానికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లోకాయుక్తను ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగించిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త 2012లో అప్పటి కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. స్పందించిన కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. లింగమనేని సంస్థపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకుంటున్నామని 2013లో లోకాయుక్తకు సమాధానమిచ్చిన ఉడా 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వ్యవహారాన్ని అటకెక్కించిందని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఉడా సహకారంతో వందలాది ఎకరాలను లాక్కున్న లింగమనేని సంస్థ చినకాకాని, కాజా, నిడమర్రు, కంతేరు, నంబూరు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,200 ఎకరాల భూములను దక్కించుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ నుంచి ఈ భూములను మినహాయించింది. లింగమనేని అక్రమాలపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top