అప్పు ముప్పు | lease farmers in debt | Sakshi
Sakshi News home page

అప్పు ముప్పు

Aug 15 2014 3:51 AM | Updated on Sep 2 2017 11:52 AM

జిల్లాలోని కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో అసలు ఎంత వర్తిస్తుందో తెలియని స్థితిలో కొందరుంటే, బ్యాంకుల నుంచి రుణాలు అందక బయట అప్పులు చేసిన వారు.. తమ పరిస్థితి ఏంటని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

వ్యవసాయ రంగంలో వస్తున్న సంక్షోభానికి ప్రత్యక్షంగా ఇబ్బంది పడుతోంది, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటోంది కౌలురైతులే. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతులుంటే అందులో లక్షన్నర వరకూ కౌలు రైతులున్నారు. వీరిలో కేవలం ఆరువేల మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలు దక్కాయి. అందులో కూడా జేఎల్‌జీ (జాయింట్ లయబులిటీ గ్రూప్) ద్వారా రుణాలు పొందారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే కౌలు రైతులు గ్రూపుగా తీసుకున్న రుణాల గురించి మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. గ్రూపును యూనిట్‌గా తీసుకుని మాఫీ చేస్తే కౌలు రైతుకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది.

జేఎల్‌జీలో ఐదుగురు సభ్యులుంటారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలకు మించి ప్రయోజనం ఉండ దు. దీనివల్ల కౌలు రైతులు ఇంకా అప్పుల్లోనే ఉంటారు. కౌలురైతులు గ్రూపు ద్వారా వచ్చిన పదివేలో, 20 వేలో పెట్టుబడి సరిపోక బంగారం కుదువ పెట్టి అప్పులు తీసుకున్నారు. చాలా మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుని వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కౌలు రైతుల అన్ని అప్పులను మాఫీ చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 20న ఆందోళనకు రైతుసంఘాలు సిద్ధమవుతున్నాయి.

 కౌలు రైతులపై చిన్నచూపు: కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. 2011లో కౌలురైతుల రక్షణకు చట్టాలు వచ్చినా అవి అమలు కావడం లేదు.  2011లో 24 వేల గ్రూపుల ఏర్పాటు కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ తర్వాత రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్ల నిర్లక్ష్యంతో వీటి ఏర్పాటు ముందుకు సాగలేదు.  కేవలం 14,733 మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు వచ్చాయి. అయితే రుణాలు మాత్రం రాలేదు.  

జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల రుణాలు తీసుకోవడానికి కౌలు రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం జూన్‌లో రుణాలిస్తారు. అయితే జిల్లాలో ఖరీఫ్ ఆగస్టు, సెప్టెంబర్‌లో జరుగుతుంది. దీంతో ఆ సమయానికి రైతుతో ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో కౌలురైతులకు రుణం తీసుకునే అవకాశం లేకుండా పోతోంది.

ఎవరైనా కౌలు చేస్తుంటే గ్రామసభ పెట్టి భూ యజమానికి ఇష్టం ఉన్నా లేకపోయినా జేఎల్‌జీ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టం గురించి కింది స్థాయిలో రెవెన్యూ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో స్థల యజమాని నుంచి సంతకం కావాలని అడుగుతున్నారు. అయితే ఇవే పొలాలపై యజమానులు రుణాలు తీసుకోవడం వల్ల కౌలు రైతులకు రుణాలు అందని పరిస్థితి ఏర్పడుతోంది.

జిల్లాలో వ్యవసాయం, బంగారం, డ్వాక్రా రుణాలు ఐదు వేల కోట్లకు పైగా ఉంటే రూ.2800 కోట్లు మాఫీ అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో కౌలు రైతుల రుణాలు మాఫీ అయ్యేది కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమేనని సమాచారం. ఇప్పటికైనా కౌలురైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement