దొరికితే మహా ప్రసాదం | Laddu Size Changes In TTD Prasadam Chittoor | Sakshi
Sakshi News home page

దొరికితే మహా ప్రసాదం

Published Thu, Jun 28 2018 11:43 AM | Last Updated on Thu, Jun 28 2018 11:43 AM

Laddu Size Changes In TTD Prasadam Chittoor - Sakshi

తిరుమలలో ప్రసాదమంటే భక్తులందరికీ ఎంతో ప్రీతి. దీనిని అపురూపంగా భావిస్తారు. దర్శనానంతరం ఇచ్చే లడ్డూ లేదా అన్నప్రసాదం  స్వీకరించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రసాదం రానురాను చిక్కిపోతోంది. కౌంటర్‌లో దానిని అందుకోవడమే మహా ప్రసాదంగా భావించే పరిస్థితి వచ్చింది. అన్నప్రసాదాల తయారీ నానాటికీ తగ్గించివేయడమే ఇందుకు కారణం.

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి లడ్డూతో పాటు మరెన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో... స్వామికి సమర్పించే అన్న ప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉంటాయి. అటువంటి అన్న ప్రసాదాలు ఇటీవల కాలంలో దొరకడమే అరుదైపోతోంది. రకరకాల సాకులతో ప్రసాదాల తయారీని టీటీడీ అంతకంతకూ తగ్గించివేస్తోంది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

శ్రీవారికి లడ్డూ మాత్రమే కాదు ఎన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. స్వామికి పెట్టే చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంబం, పులిహోర, మలిహోర, పాయసం, పోలీ, సుగీ, జిలేబీ ఇవన్నీ అంతకు మించి రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ... జీడిపప్పు తేలుతూ ఉండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా రుచిచూసే భాగ్యం కలగాలని భక్తులు ఆశపడతారు. అటువంటి అన్న ప్రసాదాలు ప్రస్తుతం కరువయ్యాయి. ప్రసాదాల తయారీని అంతకంతకూ తగ్గించేస్తున్నారు.

అత్యంత నిష్టతో ప్రసాదాల తయారీ..
సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు (200 గంగాళాలు), వారంతాల్లో రోజుకు 1,200 కిలోలు (250 గంగాళాలు) ప్రసాదాలు తయారు చేసేవారు. ఈ ప్రసాదాలను వకుళామాత పోటు, పాకశాల, అవ్వపోటుగా పిలిచే వంటశాలలోనే వెయ్యేళ్లుగా తయారుచేస్తున్నారు. తయారయ్యాక వీటిని శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామికి ఆరగింపుచేస్తారు. దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదాలను వైఖానస వైష్ణవులు అత్యంత నిష్టతో తయారు చేస్తారు. చిన్న లడ్డు రోజులో ఒకటి రెండు గంట లు సమయం మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయంలో అన్న ప్రసాదాలనే పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఉదయం నైవేద్యం అయిన తరువాత మధ్యాహ్నం 12 గంటల కల్లా అన్న ప్రసాదాలు ఖాళీ అవుతున్నాయి.  మళ్లీ అన్న ప్రసాదం దొరకాలంటే అర్ధరాత్రి గంటదాకా ఆగాల్సిందే.

ప్రసాదాల తయారీ సిబ్బందిని తగ్గించారా?
అన్న ప్రసాదాల పోటులో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని టీటీడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరుగా రిటైరవుతున్నారు. ఆ స్థానంలో ఇంకొకరిని నియమించడం లేదు. సీనియర్లుండగానే కొత్తవారిని నియమించి, వారికి శిక్షణ ఇప్పిస్తే ప్రసాదాల తయారీ నేర్చుకుంటారు. ఎంతో అనుభవం ఉంటే గానీ వీటిని తయారు చేయలేరు. అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో అన్న ప్రసాదాల పోటులో 120 నుంచి 150 మంది పనిచేసేవారు. ప్రస్తుతం 60 మంది మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున పనిచేస్తున్నట్లు సమాచారం.

ప్రసాదాలు తయారు చేయడమే కాకుండా... సిబ్బంది గంగాళాలను నైవేద్యం కోసం గర్భగుడిలోకి తరలించాలి. ఆరగింపు తరువాత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసే స్థలానికి తీసుకెళ్లాలి. పనిభారం వల్ల ప్రసాదాల పరిమాణమే కాదు... తయారయ్యే రకాలు తగ్గిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల ఆరోపణల్లో ప్రధానమైంది స్వామి వారిని పస్తులు పెడుతున్నారన్నది కూడా ఉంది. స్వామివారికి నివేదించే ప్రసాదాలు తగ్గిపోతున్నాయని ఆయన ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. లడ్డూలు ఇస్తున్నామంటూ టీటీడీ అ«ధికారుల నుంచి సమాధానం వినిపిస్తోంది.

శ్రీవారి నైవేద్యాలు ఎందుకు తగ్గించారు?
ఒకప్పుడు శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించేవారు. ఈ ప్రసాదాల గంగాళాలతో ఆలయం నిండిపోయేది. ప్రస్తుతం 12 గంగాళాలలో మాత్రమే ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించాలంటూ నైవేద్యాల పరిమాణాన్ని తగ్గించేశారనే ప్రచారం జరుగుతోంది. నైవేద్యం గంగాళాలతో లోనికి తీసుకెళ్లడం, బయటకు తరలించడానికి అరగంటకు పైగా పడుతోంది. ఆ సమయంలో మూడువేల మంది దర్శనం చేసుకునే అవకాశం కోల్పోతారని నైవేద్యం గంగాళాలను తగ్గించారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దర్శనం పేరుతో ఆలయ సంప్రదాయాలకు, కైంకర్యాలపై పరిమితులు విధించడం సంప్రదాయ విరుద్ధమని భక్తులంటున్నారు.  

భక్తులకు అన్నప్రసాదాలనుదూరం చేయకండి..
కొంతకాలంగా అన్న ప్రసాదాలు కరువయ్యా యి. అయినదానికి కానిదానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న టీటీడీ అన్న ప్రసాదాల విషయంలో కక్కుర్తిని ప్రదర్శించడం తగదు. ఇది సంప్రదాయం కాదు. భక్తులకు అన్ని రకాల అన్న ప్రసాదాలు అందుబాటులోకి తీసుకురావాలి.   – నవీన్‌కుమార్‌ రెడ్డి,శ్రీవారి భక్తుడు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement