అవినీతిలేని పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు.
మంచాల, న్యూస్‌లైన్: అవినీతిలేని పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో నిర్వహించనున్న బీజేపీ యువగర్జన కార్యక్రమానికి వెళ్తూ మంచాల మండలం ఆగాపల్లి గ్రామ చౌరస్తాలో పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. యావత్ దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. కుంభకోణాలతో దేశాన్ని దివాలా తీయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు.
ఉన్నతాశయంతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే శక్తి నరేంద్ర మోడీ కే ఉందన్నారు. రైతు బాంధవుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహ నిర్మాణం కోసం గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి వాడే ఇనుప పరికరాలను పంపించాలని కిషన్‌రెడ్డి కోరారు. వాటిని కరిగించి పటేల్ విగ్రహాన్ని తయారు చేయనున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామసీమలు పచ్చని పంటలతో కళకళలాడుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ దన్నె బాషయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం, నాయకుడు కె.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.