భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పశ్చిగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా అడుగుపెట్టి.. అలా వెళ్లిపోయారు.
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పశ్చిగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా అడుగుపెట్టి.. అలా వెళ్లిపోయారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కనీసం రైతులను పలకరించి, పరామర్శించి, వాళ్లకు ఊరటనిచ్చే మాటలేవైనా నాలుగు చెబుతారని అంతా ఆశిస్తారు. కానీ, ఈసారి మాత్రం అలా జరగలేదు. అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందుగానే పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం ఏరియల్ సర్వే మాత్రమే చేద్దామని అనుకున్నారు.
అలాగే హెలికాప్టర్లో నరసాపురం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఎంపీ కనుమూరి బాపిరాజు, మంత్రులు పితాని సత్యనారాయణ తదితరులు, జిల్లా కలెక్టర్ తదితరులు స్వాగతం పలికారు. కానీ, వాతావరణం అనుకూలించలేదంటూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన రద్దయింది. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోతే కనీసం రోడ్డు మార్గం ద్వారానైనా అందుబాటులో ఉన్న ఒకటి రెండు ప్రాంతాల్లో పర్యటించి, రైతులకు వడ్డీ మాఫీయో, రుణాల రీషెడ్యూలింగో, లేదా అసలు పంట రుణాలను మాఫీ చేయడమో.. ఏదో ఒకటి చేస్తారని రైతులు ఎంతో ఆశగా ఎదురు చేశారు. కానీ, వారందరికీ నిరాశే మిగిలింది.
భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాకు దాదాపు 800 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. 59,045 హెక్టార్ల మేర వరిపంట నీట మునిగిపోయింది. 2,453 హెక్టార్లలో ఉద్యానపంటలు, 9 హెక్టార్లలో చేపల చెరువులు కూడా నష్టపోయాయి. రోడ్లు, ఇళ్లు, కరెంటు స్తంభాలు... ఇలా అన్నింటికీ కలిపి చూసుకుంటే మొత్తం నష్టం 808.18 కోట్ల రూపాయలుగా తేలింది.
ఈ విషయం ముఖ్యమంత్రికి ముందుగానే తెలుసు. జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదికను అప్పటికే రూపొందించారు. కానీ, ముఖ్యమంత్రికి మాత్రం పశ్చిమ రైతుల కష్టాలు ఏమాత్రం పట్టలేదు. అందుకే ఆయన కేవలం నరసాపురంలో ఇలా దిగి, అలా మళ్లీ తిరుగు ప్రయాణం కట్టారు. ఇంతోటి పర్యటన కోసం అసలు హైదరాబాద్ నుంచి రావడం ఎందుకు, ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకని కూడా రైతులు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.