కియ్యో..మొర్రో !

kia industry land collections Compensation pending from one year - Sakshi

ఏడాదైనా అందని పరిహారం

కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు

నేటి సీఎం పర్యటనను అడ్డుకుంటామంటున్న బాధితులు

కియా.. ప్రస్తుతం ఈ పేరు జిల్లా వాసులకు సుపరిచితం. కియా కార్ల పరిశ్రమ ఇక్కడికి రావడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. అందుకు తమ భూములు కోల్పోయిన రైతులు మాత్రం భగ్గుమంటున్నారు.  ఏడాదిగా పరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఫలితం లేదని మండిపడుతున్నారు. ఎన్ని అర్జీలు ఇచ్చినా.. ఎంత మంది అధికారులను వేడుకున్నా.. ఫలితం లేదంటున్నారు. పరిహారం రాకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమవుతున్నారు.   

పెనుకొండ : వడ్డే నాగరాజుకు చెందిన (సర్వేనెంబర్‌ 193–10లో) 2.34 ఎకరాలు భూమిని కియా కార్ల పరిశ్రమకు ప్రభుత్వం తీసుకుంది. 1.50 ఎకరాలకు పరిహారం ఇవ్వగా మరో 0.84 సెంట్ల భూమికి పరిహారం ఇవ్వాలి. ఏడాదిగా తిరుగుతున్నా పరిహారం అందడం లేదు. దీంతో నాగరాజుతో పాటు ఆయన అన్నదమ్ములంతా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మండలంలోని కురుబవాండ్లపల్లికి చెందిన ఈ.రామాంజనేయులుకు సర్వేనంబర్‌ 355లో 3.59 ఎకరాలు ఉంది. రూ.37.69 లక్షల పరిహారం అందాలి. కానీ ఇప్పటి వరకు పరిహారం పెండింగ్‌లో ఉంది.
వీరే కాదు.. కియా కోసం భూమిని కోల్పోయి.. నేటికీ పరిహారం అందని రైతులు  దాదాపు 40 మంది ఉన్నారు. వీరి పరిస్థితి త్రిశంకుస్వర్గంలో ఉంది. రెవెన్యూ అధికారులు రైతుల సమస్యను గాలికొదిలేయడంతో తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.. బాధిత రైతులు. కియా కార్ల పరిశ్రమకు భూములు ఇచ్చి పలువురు రైతులు ఏడాదైనా పరిహారం అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం చేయమని అధికారులు, నాయకులను వేడుకుంటున్నారు. అయినా ఇప్పటికీ న్యాయం జరక్కపోగా కాలయాపనతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లోకి పడే ప్రమాదం ఏర్పడింది. సీఎం వచ్చి వెళ్లాక చూద్దామని అధికారులు అంటుండగా ఆయన వచ్చి వెళ్లాక తమ డబ్బు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.    

హక్కుదారులైనా.. రైతులకు పరిహారం మమ..
ఏళ్ల తరబడి కొందరు రైతులు భూములు సాగుచేసుకుంటున్నారు. భూమిపై పట్టాదారు పాసుపుస్తకం, 1–బీ తదితర వివరాలతో పూర్తీ హక్కులు కలిగి ఉన్నారు. అయితే భూమికి సంబంధించిన పట్టాలు రైతుల వద్ద లేవని అధికారులు పరిహారం వారి ఖాతాలకు జమ చేయడం లేదు. కనీసం చిన్న  వివాదాలు కూడా పరిష్కరించకుండా పరిహారం సొమ్మును పెండింగ్‌లో ఉంచారు. అలాగే కొందరు రైతులకు వారి భూములు వంక పొరంబోకులో ఉన్నాయని నిలుపుదల చేశారు. అయితే ఆ భూములకు సంబంధించి రైతుల వద్ద పట్టాదారు పాసుపుస్తకం,1బీ, సిస్తు చెల్లించిన రశీదులు ఇతర ఆధారాలన్నీ ఉన్నాయి. అయినా బాధితులు పరిహారం కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

సీఎం పర్యటన  అడ్డుకుంటామంటున్న రైతులు
తమ పరిహారం విషయమై తాడో పేడో తేల్చుకోవాలని బాధిత రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవాల ని యోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు నిరసన తెలపగా లోలోపల రెవెన్యూ అధికారులు పోలీసుల ద్వారా పంచాయితీ చేసి సీఎం పర్యటన ముగిసే వరకు వివాదం జఠిలం కాకూడదన్న ఆలోచనతో ఉన్నారు. అయితే సీఎం వచ్చి వెళ్లాక తమ పరిస్థితి ఏంటోనన్న ఆందోళనలో రైతులు మునిగిపోయారు.  

పరిహారం కోసం కంటతడి
పెనుకొండ : పరిహారం ఇవ్వకుండా అధికారులు అధికారులు తమ భూముల్లో కియా కార్లపరిశ్రమకు సంబంధించి పనులు చేయిస్తున్నారని పలువురు గిరిజనులు బుధవారం కంటి తడిపెట్టారు. పలువురు అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో పనులు చేస్తున్న జేసీబీలను అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే.. అధికారులు రెండో విడత తీసుకున్న కియా కార్ల పరిశ్రమ భూముల్లో పలువురు రైతులకు ఇంకా పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో బహిరంగ సమావేశం జరిగే ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రైతులు సాలీబాయి, గోవింద్‌నాయక్, ఆంజనేయులు నాయక్‌ తదితరుల భూములకు పరిహారం అందలేదు. దీంతో తమకు పరిహారం ఇవ్వకువండానే తమ భూముల్లో పనులు చేస్తున్నారని, తమ పరిహారం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళా రైతుసాలీబాయి పెద్ద ఎత్తున రోధించింది. రైతులు గోవింద్‌నాయక్, ఆంజనేయులు నాయక్‌ తదితరులు కంట తడిపెట్టారు. ఆగ్రహంతో జేసీబీ పనులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఇవ్వకుండానే పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే తమ భూపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పొలంలోనే ఆత్మహత్యలు చేసుకుంటామని పేర్కొన్నారు.  

35ఎకరాలు  పెండింగ్‌లో ఉంది..
అన్నదమ్ముల వివాదాలు ఉన్న  భూములకు, వంక పోరంబోకు భూములకు సంబంధించి 35 ఎకరాల మేర పరిహారం పెండింగ్‌లో ఉంది. అన్నదమ్ముల వివాదాలకు  సంబంధిం చి పరిష్కరించుకుని వస్తే వెంటనే పరిహారం ఇస్తాం. వంక భూములకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. వచ్చిన వెంటనే అందజేస్తాం. ఏ రైతుకు అన్యాయం చేయం. – రామమూర్తి, ఆర్డీఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top