తాడిపత్రిలో జేసీ పోలీస్‌

Kethireddy Pedda Reddy Comments On JC Diwakar Reddy Anantapur - Sakshi

తాడిపత్రి (అనంతపురం): తాడిపత్రిలో ఏపీ పోలీసులు లేరని, ఉన్నవాళ్లంతా జేసీ పోలీసులేనని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారన్నారు. చిన్నపొలమడ వద్ద ఎంపీ తన 500 మంది అనుచరులతో వెళ్లి టెంట్లు వేసుకుని ఆశ్రమంపై దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. ప్రబోధాశ్రమ భక్తులు ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించినప్పుడు ఇరువార్గాల వారు తీవ్రంగా గాయపడ్డారని.. అయితే ఈ అల్లర్లకు మూల కారణం ఎంపీ జేసీయేనన్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్‌ ప్రతి గ్రామంలో కక్షలను పెంచి పోషించారని, శాంతి భద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఇందుకు తాజా ఉదాహరణ చిన్నపొలమడలో గణేష్‌ నిమజ్జనానికి అనుమతి ఇవ్వడమేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గ్రామస్తులు వివరించినా.. పోలీసులు బలవంతంగా ఆశ్రమం వద్దకు తీసుకెళ్లి ఘర్షణలకు కారణమయ్యారన్నారు. ఘర్షణలకు కారణమైన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసును నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవల ఊరుచింతల గ్రామంలో జంట హత్యలు జరిగాయని, అందుకు రూరల్‌ సీఐ నారాయణరెడ్డి పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదని, సామాన్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే జేసీ సోదరుల అనుమతి లేనిదే అంగీకరించడం లేదన్నారు. ఇక్కడి పోలీసులకు ఉన్నతాధికారులంటే జేసీ సోదరులేనని వ్యాఖ్యానించారు. ఇటీవల చుక్కలూరులో ఓ దళితునిపై దాడి జరిగిందని, ఈ విషయంలో జేసీ అనుచరునికి చెందిన ఓ బ్రోకర్‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రూరల్‌ సీఐ కేసు నమోదు చేయలేదన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సభ్య సమాజం తలదించుకునేలా పోలీస్‌స్టేషన్‌ ముందు 24గంటల పాటు ధర్నా చేసిన ఎంపీ జేసీపై పోలీసులు ఎంతుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

అదే మరెవరైన పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేస్తే వారి గుడ్డలు ఊడదీసి కొట్టిన సందర్భాలు లేవా అన్నారు. ప్రబోధాశ్రమంపై దాడి చేసిన ఎంపీ జేసీ, ఆయన అనుచరులపై వచ్చే 15లోపు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే ఇరువార్గలపై కేసులు నమోదు చేస్తారని.. తాడిపత్రిలో మాత్రం పోలీసులు ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల వైఖరి ఇదే విధంగా కొనసాగితే బీహార్‌ తరహాలో ప్రతి నాయకుడూ ఒక దళాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల్లో రానురాను పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top