హరిబాబు రాజీనామా..చేశారా.. చేయించారా?

Kambhampati Haribabu Resigned To BJP  Post - Sakshi

‘హరిబాబు’ రాజీనామాపై సర్వత్రా చర్చ

ఇప్పటికైనా కేబినెట్‌ పదవి దక్కేనా..

కొత్త అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు

టీడీపీ పట్ల ఆయన మెతక ధోరణిపై పార్టీలో విమర్శలు

మనస్తాపంతోనే రాజీనామా చేశారని వాదనలు

పార్టీయే రాజీనామా చేయించిందని మరో వాదన

జాతీయ పార్టీకి మూడేళ్లకుపైగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు.. ఒక దశలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన్ను ఊరించింది.. టీడీపీ, బీజేపీ పొత్తు పెటాకులైన తర్వాత సీను మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని టీడీపీ సర్కారుపై అస్త్రశస్త్రాలు సంధించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే  కేంద్రంపై టీడీపీ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పలు వేదికలపై తిప్పికొట్టడానికి ప్రయత్నించిన ఎంపీ హరిబాబు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతో ప్రత్యేక బుక్‌లెట్‌ కూడా ఆవిష్కరించారు.

అంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చర్చోపచర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలోని టీడీపీ సర్కారు పట్ల ఆయన మెతక వైఖరితో ఉన్నారని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. అందుకనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. ఈ క్రమంలో హరిబాబు విమర్శలకు వగచి తనంత తానుగా రాజీనామా చేశారా?.. అధిష్టానం చేయించిందా?? అన్న చర్చలు కొనసాగుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. హరిబాబు రాజీనామా స్వచ్ఛందంగానే చేశారా? లేక చేయమని ఒత్తిడి చేశారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మిత్రపక్షంతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారని ఓ వాదన విన్పిస్తుండగా, తనపై పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి రాజీనామా చేసి ఉంటారని మరో వాదన బలంగా విన్పిస్తోంది.ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్‌కు బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి ఉండేవారు. రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోయిన తర్వాత 13 జిల్లాలకు పార్టీ అధ్యక్షునిగా సీనియర్‌ నాయకుడైన కంభంపాటి హరిబాబుకు అప్పగించారు. 2014 జనవరిలో బా«ధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది.

విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో సైతం ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై హరిబాబును మార్చాల్సిందేనంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు పార్టీ అధిష్టానంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పేరు ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి హరిబాబుకు కేబినెట్‌ బెర్త్‌ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో రాజధాని నుంచి వచ్చిన పిలుపుతో హరిబాబు ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు కేబినెట్‌ బెర్త్‌ దక్కలేదు. కాగా తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీ మంత్రులు కూడా రాజీనామాలు చేయడంతో కేంద్ర కేబినెట్‌లో ఏపీకి ప్రాధాన్యత లేకుండా పోయింది.  

సొంత పార్టీలోనే విమర్శల సెగ
ఆది నుంచి సౌమ్యునిగా ముద్ర పడిన హరిబాబు ఏనాడు విపక్షాలపై కూడా ఘాటైన విమర్శలు చేసిన పాపాన పోలేదు. నాలుగేళ్ల కాపురం తెగతెంపులు చేసుకోవడంతో టీడీపీపైన, ఆ పార్టీ పెద్దలపై సొంత పార్టీ నేతలు ఓ వైపు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే హరిబాబు మాత్రం కొద్దికాలం మౌనముద్ర వహించారు. దీంతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తన సహజశైలికి భిన్నంగా ఇప్పుడిప్పుడే టీడీపీ పెద్దలపై విమర్శలు చేయడం మొదలు పెట్టినప్పటికీ హరిబాబుపై పార్టీలో విమర్శలు మాత్రం తగ్గలేదు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తక్షణమే అధ్యక్ష మార్పు చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదన ఆయన వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎంపీ హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. ఆ లేఖను గుట్టుచప్పుడు కాకుండా పార్టీ అధినేత అమిత్‌షాకు పంపడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజీనామా చేస్తే తాను ఫలానా కారణంగా రాజీనామా చేస్తున్నానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత ఎవరైనా సమర్పిస్తారు. కానీ హరిబాబు సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అ«ధ్యక్షునికి పంపగా.. ఆ విషయాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం పార్టీని కుదుపేస్తోంది. ఆ తర్వాత తన రాజీనామా విషయాన్ని హరిబాబు ధ్రువీకరించారు.

కొలిక్కి రాకుండానే.. సాధారణంగా కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఖరారైన తర్వాత పాత అధ్యక్షునితో రాజీనామా చేయిస్తారు. పాత అధ్యక్షుడి నుంచి కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ జరుగుతోంది. కానీ ఇక్కడ కొత్త అధ్యక్షుడెవరనేది కొలిక్కి రాకుండా హరిబాబు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ పెద్దలు చేస్తున్న విమర్శలను హరిబాబు సమర్ధ వంతంగా తిప్పికొట్టలేక పోతున్నారని తక్షణమే ఆయన్ని తప్పించాలంటూ పార్టీ అధినాయకత్వంపై ఆయన వ్యతిరేక వర్గీయులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెంది తనంతట తానుగా రాజీనామా చేసి ఉంటారని పార్టీలో ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షత పదవి మార్పు అనివార్యంగా మారిన నేపథ్యంలో అధిష్టానమే గౌరప్రదంగా తప్పుకోమని సూచించి ఉండవచ్చునని ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

రాజకీయ కోణం లేదన్న విష్ణుకుమార్‌రాజు
ఆది నుంచి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు ఈ వ్యవహారంపై ఆచీతూచి స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయకోణం ఏమీ లేదంటూ ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ కోణం లేనప్పుడు ఎందుకు రహస్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టిపారేశారు. కొత్త అధ్యక్షుడు కావాలంటే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాలి కదా? అని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర వ్యాఖ్యానించారు. హరిబాబుకు కచ్చితంగా కేబినెట్‌లో స్థానం లభిస్తుందన్న విశ్వాసం తమకుందని ఈ ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రేసులో ఉన్న సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, పురందేశ్వరిలతో పాటు తాజాగా విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top