కూలిన కల్వర్టు

Kalvartu Collapsed In Visakhapatnam - Sakshi

దేవరాపల్లి మండలం బోయిలకింతాడ వద్ద ఘటన

విద్యార్థులతో వెళుతున్న బస్సుకు తప్పిన ప్రమాదం

15 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం

దేవరాపల్లి (మాడుగుల): దేవరాపల్లి నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో బోయిలకింతాడ గ్రామం వద్ద ఆర్‌అండ్‌బి కల్వర్టు కూలిపోయింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడ,తో ఆ రోడ్డుకు ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 25 అడుగుల వెడల్పున ఉన్న కల్వర్టు కూలిపోయే సమయంలో దేవరాపల్లి నుంచి చోడవరం వైపు వెళ్తున్న బస్సు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. వందమందికి పైగా కాలేజీ విద్యార్థులతో చోడవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కల్వర్టు కూలిపోవడానికి ఒక్క క్షణం ముందు దాటిపోవడంతో రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడింది. దేవరాపల్లి నుంచి గవరవరం మీదుగా చోడవరం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

వాణిజ్య కేంద్రమైన చోడవరంలో కోర్టుల సముదాయంతోపాటు ట్రెజరీ కార్యాలయం తదితర సదుపాయాలు ఉండటంతో మండలంలోని దేవరాపల్లి, కాశీపురం, చిననందిపల్లి, పెదనందిపల్లి, తారువా, ఏ.కొత్తపల్లి, కెఎం పాలెం, మారేపల్లి, తెనుగుపూడి, వెంకటరాజుపురం, గరిశింగి, వాకపల్లి, తిమిరాం, కలిగొట్ల తదితర గ్రామాల ప్రజలు బోయిలకింతాడ మీదుగానే చోడవరానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కల్వర్టు కూలిపోడంతో మండల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 8 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించి తారువా బ్రిడ్జి, మామిడిపల్లి, వేచలం మీదుగా గవరవరం శారదానదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాజ్‌వే పైనుంచి వెళ్లాల్సివుంటుంది. కాజ్‌వేపై నుంచి శారదానది ఉప్పొంగి ప్రవహిస్తే ఆ అవకాశం కూడా ఉండదు.

అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..
ఈ శిథిల కల్వర్టు కూలిపోతుందని స్థానిక తాజా మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మండల యువజన అధ్యక్షుడు బూరె బాబురావు పలు మార్లు ఆర్‌అండ్‌బి అధికార్లు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు మండల సర్వ సభ్య సమావేశంలో సైతం పలుమార్లు ఇదే సమస్యపై గళమెత్తారు. అప్పట్లో అధికార్లతో పాటు అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు.

ఇసుక లారీ వలనే కూలిపోయింది.....
బోయిలకింతాడ వద్ద కూలిపోయిన కల్వర్టును ఆర్‌అండ్‌బి ఏఈ కె.వెంకటేశ్వరరావు సోమవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. 10 టన్నులు బరువుకు మాత్రమే పర్మిషన్‌ ఉన్న ఈ రహదారిలో సుమారు 50 టన్నుల మేర అధిక బరువుతో ఉన్న ఇసుక లారీలు రాకపోకలు సాగించడం వలనే కల్వర్టు కూలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
దేవరాపల్లి–చోడవరం ప్రధాన రహదారిలో బోయిలకింతాడ వద్ద కూలిన కల్వర్టు సమస్యను ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్తాను. ప్రతీ రోజు వందలాది మంది విద్యార్దులు కాలేజీలకు, మండల ప్రజలు నిత్యం కోర్టులు, ట్రెజరీ తదితర పనులపై చోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో కూలిన కల్వర్టుకు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను యుద్దప్రాతిపదకన చేపట్టేలా అధికార్లుపై ఒత్తిడి తీసుకువస్తాను. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాను.–బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top