
ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి తేవాలి
ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీలోని ఉద్యోగ అభ్యర్థులు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
* విపక్షనేత జగన్‌కు నిరుద్యోగుల మొర
* ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేసేలా చూడాలని వినతి
సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీలోని ఉద్యోగ అభ్యర్థులు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తఫాతో పాటుగా వచ్చిన పలువురు నిరుద్యోగులు బుధవారం జగన్ నివాసంలో ఆయనను కలసి ఓ వినతిపత్రం సమర్పించారు.
ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వోద్యోగాల విషయంలో సంవత్సర క్యాలెండర్‌ను రూపొందించి అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడంలేదని వారు ఆ వినతిపత్రంలో తెలిపారు. 2009లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గ్రూప్-1, 2, జేఎల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిందని, ఆయన మరణం తరువాత ఆలస్యంగా ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2012లో గ్రూప్-1,2 నోటిఫికేషన్లు జారీ అయినా గ్రూప్-2 పరీక్షలు మాత్రమే సజావుగా జరిగాయన్నారు. 2013లో మళ్లీ గ్రూప్-1, 2, జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని కిర ణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడంతో అనేకమంది నిరుద్యోగులు ఎంతో డబ్బు వెచ్చించి హైదరాబాద్‌లో పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన ఫలితంగా తెలంగాణకు 1,10,000, ఏపీకి 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను కేటాయించారని, వీటిలో సుమారు 3,000 వరకూ గ్రూప్-1, 2 ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి ఉద్యోగార్థుల కోరికకు అనుగుణంగా నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, కానీ ఏపీలో మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. మార్చి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో తమ సమస్యలను లేవనెత్తి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని వారు జగన్‌ను కోరారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగమేళా మాదిరిగా అధిక పోస్టులతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చేట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. జగన్‌ను కలసిన ఉద్యోగార్థుల్లో వి.మల్లయ్య, పి.రోజారాణి, ఎం.శ్రీనివాసరెడ్డి, పి.మునికుమార్, పిగిలి వాసు, ఎం.లక్ష్మిరెడ్డి, మణికంఠ, పి.ప్రసాద్, ఎస్.సద్దాంహుస్సేన్, పి.అజయ్‌కుమార్, కె.కొండలరావు, ఆర్.నాగార్జునరావు, కె.రాజయ్య ఉన్నారు.