జైలు..ఫుల్‌ ! | Jails Filled With Prisoners In Vijayawada | Sakshi
Sakshi News home page

జైలు..ఫుల్‌ !

Sep 21 2018 11:54 AM | Updated on Sep 21 2018 11:54 AM

Jails Filled With Prisoners In Vijayawada - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : ఎంతో చరిత్ర కలిగిన విజయవాడ జిల్లా జైలును బ్రిటీష్‌ పాలకులు నిర్మించారు. ఇందులో ఏడు బ్యారెక్‌లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 166 మంది కాగా.. ఏ నుంచి జీ వరకు ఉన్న బ్యారెక్‌లలో ఏ, బీలలో 97 మందిని ఉంచుతారు. ఇక మిగిలిన వారిని ఐదు బ్యారెక్‌ల్లో ఉంచుతున్నారు. వీరితోపాటు ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు సైతం ఇక్కడ ప్రత్యేక బ్యారెక్‌ల్లోనే ఉంటున్నారు. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటంతో బ్యారెక్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. వసతులు కల్పించేందుకు సైతం ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. అదే సందర్భంలో జైలులో ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా, ఖైదీలు గొడవలు పడ్డా వారిని నివారించడం జైలు సిబ్బందికి సాధ్యపడని అంశంగా మారింది.

రెట్టింపు సంఖ్యలో ఖైదీలు....
జిల్లాలో జిల్లా కారాగారంతోపాటు అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు సబ్‌ జైలులున్నాయి. రిమాండ్‌ ఖైదీలను ఇక్కడికి తరలిస్తుంటారు. అయితే వీటిలో చాలా జైళ్లలో ఖైదీలు సామర్థ్యానికి మించి ఉంటున్నారు. విజయవాడ జిల్లా జైలులో 166 మంది ఖైదీలు ఉండేందుకు వీలుంది. ఆ సంఖ్యకు సరిపడా మాత్రమే అక్కడ మౌలిక సౌకర్యాలున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ రోజుకు 390 నుంచి 370 మంది ఖైదీల దాకా ఇక్కడ ఉంటున్నారు. వాస్తవానికి కారాగారంలోని ఏడు బ్యారెక్‌ల్లో ఇంత మంది ఖైదీలను ఉంచరాదు. కానీ.. చాలా మంది ఖైదీలు తప్పనిసరి పరిస్థితుల్లో.. కొందరిని ఇక్కడే ఉంచాల్సి రావడంతో ఈ పరిస్థితి దాపురించిందని జైలు సిబ్బంది చెబుతున్నారు.

చలో రాజమండ్రి....
జిల్లా జైలు ఖైదీలతో కిక్కిరిసిపోవడంతో ప్రస్తుతం జైలుకు వచ్చే రిమాండ్‌ ఖైదీలను, చిన్నచిన్న కేసుల్లో శిక్ష పడ్డ (ఆరు నెలల్లోపు) ఖైదీలను జైళ్ల శాఖ ఇతర కారాగారాలకు తరలిస్తున్నారు. రోజూ వివిధ కేసుల్లో రిమాండ్‌ విధించబడి జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా.. అక్కడ ఉన్న బ్యారెక్‌లన్నీ నిండిపోయాయి. దీంతో కొద్ది రోజులగా ఇలాంటి వారందరినీ రాజమండ్రి సెంట్రల్‌ జైలుతోపాటు, జిల్లాలో ఇతర జైళ్లకు పంపిస్తున్నారు.

కోర్టులకు లేఖలు రాశాం
ఈ విషయంపై ‘సాక్షి’ జిల్లా జైలు ఉన్నతాధికారి రఘు వివరణ కోరగా.. ‘నిజమే ప్రస్తుతం జైలు ఖైదీలతో కిటకిటలాడుతోంది. జిల్లా కారాగారం సామర్థ్యం 166 మంది మాత్రమే. ప్రస్తుతం 300 మందికిపైగా జైలులో ఉంటున్నారు. 300 ఆపై దాటడంతో జిల్లాలోని కోర్డులన్నింటికీ లేఖలు రాశాము. రాజమండ్రి జైలుకు ఖైదీలను తరలించాలని కోరాం.’ అని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement