నయా జోష్ | jagan samara deeksha success | Sakshi
Sakshi News home page

నయా జోష్

Jun 6 2015 3:03 AM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో...

జగన్ సమర దీక్ష జయప్రదం
వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం

 
 సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల సమర దీక్ష పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోని పాలకులపై జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండ్రోజుల దీక్ష విజయవంతం కోసం పదిరోజుల నుంచి వైఎస్సార్ సీపీ కీలక నేతలు చేసిన కృషి ఫలించింది.

తరలివచ్చిన ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజల ముంగిటకు సమరదీక్ష సంకల్పాన్ని తీసుకెళ్లగలిగారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా పర్యటించి పార్టీ శ్రేణులను సమరదీక్ష కోసం సన్నద్ధం చేయగలిగారు. పార్టీ  ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ మంగళగిరి వైజంక్షన్ వద్ద స్థలం ఎంపిక నుంచి దీక్ష పూర్తయ్యే వరకు ఏర్పాట్లను పర్యవేక్షించడంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సమరదీక్ష విషయంలో బాధ్యత తీసుకుని తమవంతు కృషి చేశారు.  పార్టీ కీలక నేతలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతలు బాధ్యత తీసుకుని పనిచేయడంతో లక్ష్యాన్ని సాధించినట్టయింది.

 ప్రజల్లోకి వినూత్న తరహాలో ప్రభుత్వ వైఫల్యాలు
 ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో వైఎస్సార్ సీపీ చేసిన ప్రయత్నం ఫలప్రదమైంది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన వందల హామీల్లో మచ్చుకు  ఒక వంద హామీలను ప్రస్తావిస్తూ తొలిరోజున విడుదల చేసిన ప్రజా బ్యాలెట్‌కు అపూర్వ స్పందన లభించింది. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రాంతంలోనే ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించగా, ఏడాది తరువాత అదే ప్రాంతంలో చరిత్రాత్మక సమర దీక్ష నిర్వహించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత పట్టు సాధించేందుకు దోహదం చేసింది.  

 సమరదీక్షతో టీడీపీ శ్రేణుల్లో కలవరం: ఎమ్మెల్యే కోన
 బాపట్ల :  చంద్రబాబు నయవంచనకు నిరసనగా  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  నిర్వహిం చిన సమరదీక్షకు అనూహ్య స్పందన లభించిందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. దూరప్రాంతాల నుంచి సమరదీక్షకు తరలివచ్చిన అభిమానులకు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బాపట్లలో   విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందనేది సమరదీక్షకు వచ్చిన స్పందనతో తేటతెల్లమైందని చెప్పారు. ప్రజాస్పందన చూసి అధికారపార్టీ నాయకుల్లో కలవరం మొదలైందన్నారు. హామీ ల అమలు విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ ఉన్నారనే నమ్మకం కలిగిందని, ఆ నమ్మకంతోనే రాబోవు రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని పేర్కొ న్నారు. రేవంత్‌రెడ్డి విషయంపై సీఎం సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement