కష్టాల కస్తూర్బా.. విద్యార్థులతో వెట్టిచాకిరి

Irregularities In Kasturba Gandhi Balika Vidyalayas Menu In Anantapur  - Sakshi

అనాథ, పేద ఆడ పిల్లలకు ఉన్నత చదువులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సీఆర్టీలు, ఎస్‌ఓల ఆధిపత్య పోరులో విద్యార్థినులు బలవుతున్నారు. మెనూ కూడా అమలు కాకపోవడంతో ఆకలితో అల్లాడిపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. మంత్రి శంకరనారాయణ ఇటీవల సోమందేపల్లి కేజీబీవీని సందర్శించారు. ఎస్‌ఓ, సీఆర్టీల మధ్య నెలకొన్న విభేదాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని విద్యార్థినులు మంత్రి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. మంత్రి ఆదేశాలతో తర్వాతి రోజు కలెక్టర్‌ వెళ్లి విచారణ చేపట్టి ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  

సాక్షి, అనంతపురం : బాలికల డ్రాపవుట్స్‌ తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల ఆడ పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కేజీబీవీల నిర్వహణ అధ్వానంగా మారింది. జిల్లాలో 62 కేజీబీవీలుండగా.. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ సుమారు 13,450 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ చార్జి రూ. 1000 నుంచి రూ. 1400కు పెంచింది. అయినా కూడా విద్యార్థినులకు పౌష్టికాహారం అందడం లేదు. చాలా కేజీబీవీల్లో మెనూ అమలు కావడం లేదు. ఇక్కడ స్పెషల్‌ ఆఫీసర్‌(ఎస్‌ఓ) చేయించేదే మెనూలా మారింది.  

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ స్థానంలో పామాయిల్‌ 
నిబంధనల మేరకు కేజీబీవీలకు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఈ మేరకు జూన్‌ నెలలో సన్‌ఫ్లవర్‌ అయిల్‌ సరఫరా చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం పామాయిల్‌ సరఫరా చేశారు. సెప్టెంబరు కూడా పామాయిలే సరఫరా చేశారు. తీరా దసరా సెలవుల ముందు ఓరోజు ఉన్నఫళంగా ఉన్న పామాయిల్‌ ప్యాకెట్లను వెనక్కు పంపి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ సరఫరా చేశారు.  దీని వెనుక అసలు రహస్యం అధికారులు, ఎస్‌ఓలు, సరుకులు సరఫరా చేసే అధికారులకే తెలియాలి. అలాగే వేరుశనగ విత్తనాలు, కందిబేడలు తదితర సరుకులు కూడా నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. 

ఎస్‌ఓలు, సీఆర్టీల మధ్య కోల్డ్‌వార్‌ 
దాదాపు కేజీబీవీల్లో స్పెషల్‌ ఆఫీసర్లు(ఎస్‌ఓలు), కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్లు (సీఆర్టీ)ల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. పరీక్ష పేపర్లు దిద్దడం, మార్కులు వేయడం, నోట్స్‌లు దిద్దడం తదితర విషయాలు సీఆర్టీలే చూసుకోవాలి. చాలాచోట్ల ఈ పనులన్నీ విద్యార్థినులతో చేయిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన ఎస్‌ఓలను... సీఆర్టీలు లక్ష్యం చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఎస్‌ఓలు కేజీబీవీల్లోనే ‘ప్రత్యేక వంటకాలు’ తయారు  చేయించుకుని ఇళ్లకు పార్సిల్‌ తీసుకెళ్తున్నారు. దీంతో తామేమీ తక్కువ కాదన్నట్లు సీఆర్టీలు కూడా ఎగ్‌కర్రీ, చపా తి తదితర వంటలు చేయించుకుంటున్నారు. వీరు ప్రత్యేక వంటకాలు చేయించుకుని విద్యార్థినులకు మాత్రం తక్కువ పరిమాణంలో సరుకులు వేసి వంటకాలు చేయిస్తున్నారు. మెనూపై విద్యార్థులు ఎవరైనా ప్రశ్నిస్తే ‘‘ఇది మీ ఇళ్లు కాదు..పెట్టింది తినండి’’ అంటూ నోరు పారేసుకుంటున్నారు. 

విద్యార్థినులతో ఇళ్లలోనూ పనులు 
కొందరు ఎస్‌ఓలు కేజీబీవీ విద్యార్థులతో తమ ఇళ్ల లో పాచిపనులు చేయించుకుంటున్నారు. లేదంటే కేజీబీవీలో వండిన వంటకాలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు బాలికలను వినియోగించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే దుర్భాషలాడుతున్నారు. అక్కడికీ చెప్పినమాట వినకపోతే బలవంతంగా టీసీలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే పరిస్థితి దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది.  

తూతూమంత్రంగా తనిఖీలు 
ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసినా తూతూమంత్రంగానే ఉంటున్నాయి. చుట్టపుచూపుగా వెళ్లి తనిఖీలు చేసినట్లు రికార్డుల్లో రాయడం తప్పితే... చర్యలు తీసుకుంది శూన్యం. ఇటీవల కేజీబీవీల్లో వెలుగు చూస్తున్న ఘటనలే  ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేద విద్యార్థినులు చదువుకుంటున్న కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

నా కూతురితో రోజూ వెట్టిచాకిరీ చేయిస్తోంది
‘‘కణేకల్లు కేజీబీవీ ఎస్‌ఓ నా కూతురితో రోజూ వెట్టిచాకిరీ చేయిస్తోంది. టిఫిన్, భోజనం, సాయంత్రం భోజనం ఇంట్లో ఇచ్చిరావాలని చెబుతోంది. తన ఇంట్లో పనులు కూడా చేయాలని ఇబ్బంది పెడుతోంది. ప్రశ్నిస్తే టీసీ ఇచ్చిపంపుతానంటూ పెట్టింది. పైగా పేరెంట్స్‌కు విషయాలన్నీ చెబుతావా? అంటూ  నా కుమార్తెను కొట్టి భోజనం కూడా పెట్టలేదు. ఆరోగ్య కారణాల వల్ల ఇక్కడ ఉండలేక పోతున్నా..నా టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నానంటూ నా కూతురితో బలవంతంగా లేఖ రాయించుకుని కేజీబీవీ నుంచి గెంటేసింది. నేను వెళ్లి అడిగితే నోటికొచ్చినట్లు దుర్భాషలాడింది.’’ 

ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ‘మీకోసం’లో ఓ ఇంటర్‌ విద్యార్థిని తల్లి చేసిన ఫిర్యాదు ఇది 
⇔ ‘‘రుచికరంగా వండడానికి ఇదేమైనా మీఇల్లు అనుకుంటున్నారా?.  ఏది వండితే అదే తినాలి. లేదంటే పస్తులుండండి’’  
కురుగుంట కేజీబీవీలో నాణ్యమైన భోజనం పెట్టాలని కోరిన విద్యార్థినులపై ఎస్‌ఓ దురుసు వ్యాఖ్యలివి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top