నౌకాదళానికి మరో రక్షణ కవచం | INS Vikrant Services From Next Year | Sakshi
Sakshi News home page

నౌకాదళానికి మరో రక్షణ కవచం

Dec 23 2019 8:55 AM | Updated on Dec 23 2019 8:55 AM

INS Vikrant Services From Next Year - Sakshi

భారత నౌకాదళంలో మరో రక్షణ కవచం చేరనుంది. భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌ నిర్మాణంతో విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల సరసన భారత్‌ స్థానం సంపాదించింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది.

సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్‌.. యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో మాత్రం వెనకబడి ఉంది. ఈ రంగంలోనూ బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో భారత్‌.. విక్రాంత్‌ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్‌ క్లాస్‌ యుద్ధనౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్‌ క్లాస్‌ నౌక ఇది. 1997లో విక్రాంత్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్‌ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది.

నిర్మాణానికి పదేళ్లు..
విక్రాంత్‌ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటోంది విక్రాంత్‌.  జయమ్‌ సమ్‌ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా దీనిని రూపొందిస్తున్నారు. ‘నాతో యుద్ధమంటే నాదే గెలుపు’ అని ఈ శ్లోకానికి అర్థం. 

1999లో ఇండియన్‌ నేవీకి చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ సంస్థ నౌకా డిజైన్‌ మొదలు పెట్టారు. 
2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. 
2011లో డ్రైడాక్‌ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 
2015 జూన్‌ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. 
సముద్రంలో కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయి సేవలకు ఉపయోగించనున్నారు. 
2020లో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. – ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ని ఇండియన్‌ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది.
 
ఇక భారత్‌దే పైచేయి..
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మహా సముద్రం.. హిందూ మహాసముద్రం. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్‌ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌. విక్రాంత్‌ రాకతో రక్షణ పరంగా దుర్భేధ్యంగా నిలవనుంది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహా సముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు  దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని విక్రాంత్‌ సొంతం చేసుకుంది.


విక్రాంత్‌కు కీలక  బాధ్యతలు..
విక్రాంత్‌ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్‌ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ యుద్ధ విమాన వాహక నౌక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ముఖ్యంగా నౌకాదళంలో చేరనున్న మిగ్‌–29 యుద్ధ విమానాలకు విక్రాంత్‌ ఉపయుక్తమవుతుంది.
– వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్, తూర్పు నౌకాదళాధిపతి

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement