నాసిరకం ‘కానుకలు’

Inferior 'gifts' distributing in chandranna kanuka - Sakshi

జిల్లాల్లో తిరస్కరణకు గురైన గోధుమ పిండి ప్యాకెట్లు

నాణ్యత లేని నెయ్యి, పనికిరాని బెల్లం

తయారైన తేదీ, వ్యాలిడిటీ డేట్‌ కూడా లేవు

పంపిణీ చేయాల్సిందేనంటున్న ప్రభుత్వం

కర్నూలు (అగ్రికల్చర్‌): చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు నాసిరకంగా ఉన్నాయి. ఏ మాత్రమూ నాణ్యత లేనివి పంపిణీ చేసి రూ.కోట్లు కొల్లగొట్టడానికి టీడీపీ మద్దతుదారులైన సరఫరాదారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో కమీషన్ల పర్వం కూడా జోరుగా నడుస్తోంది. నాణ్యత లేని వీటిని తాము రేషన్‌కార్డుదారులకు ఇవ్వలేమని అధికారులే కుండబద్దలు కొడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రిస్మస్, సంక్రాంతిని పురస్కరించుకొని కార్డుదారులందరికీ చంద్రన్న కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు 27,847 ఉన్నాయి. వీటి పరిధిలో 1,38,88,547 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వివిధ జిల్లాలకు వచ్చిన గోధుమ పిండి, నెయ్యిలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. వాటిని తిరస్కరించడం కలకలం రేపుతోంది.

గుజరాత్‌ నుంచి గోధుమ పిండి..
నాణ్యత లేని గోధుమ పిండి కర్నూలు జిల్లాతోపాటు కోస్తా జిల్లాలకు చేరింది. కర్నూలు జిల్లాకు 963 టన్నుల గోధుమ పిండి ప్యాకెట్లు మంగళవారం వచ్చాయి. కాసుల కక్కుర్తితో గుజరాత్‌ నుంచి నాసిరకం గోధుమ పిండిని దిగుమతి చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్‌ తేదీ నుంచి వ్యాలిడిటీ మూడు నెలలు ఉండాలి. కానీ కొన్ని ప్యాకెట్లపైన వ్యాలిడిటీ 2 నెలలు ఉండగా, కొన్నిటికి తయారీ తేదీ, వ్యాలిడిటీ డేట్‌ లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించకపోవడం, నాసిరకంగా ఉండటంతో మొత్తం ప్యాకెట్లను అధికారులు వెనక్కి పంపారు. కోస్తా జిల్లాల్లో కూడా తిప్పిపంపినట్టు సమాచారం.

కంపుకొడుతున్న నెయ్యి..
కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు కోస్తా జిల్లాలకు సరఫరా చేసిన నెయ్యి కంపు కొడుతోంది. కర్నూలు జిల్లాకు 6.13 లక్షల ప్యాకెట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్కటీ నాణ్యతతో లేదని అధికారులే నిర్ధారించారు. నెయ్యి ప్యాకెట్లను వాపసు తీసుకొని.. తిరిగి మంచివి ఇవ్వాలని కోరారు. అయితే.. అధికారులు మాత్రం ఆవు నెయ్యి వచ్చింది.. అందువల్లే తిరస్కరించామని బయటికి చెబుతున్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా బెల్లం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అర కిలో బెల్లం ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి ఇస్తున్నారు. ఇది బంకలా సాగుతోంది. అది కూడా నల్లగా సారాయి బెల్లాన్ని తలపిస్తోంది. శనగ, కందిపప్పుల్లోనూ కల్తీ స్పష్టంగా కనిపిస్తోంది.

నాసిరకం సరుకులనే పంచాలి!
చంద్రన్న కానుకల పేరుతో జిల్లాకు వచ్చిన సరుకులనే పంచాలని, వాటి స్థానంలో వేరేవి ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్వాకంతో పండగ పూట కార్డుదారుల నుంచి తాము తిట్లు తినాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న కానుకల సరఫరా బాధ్యతను అధికార పార్టీ నేతలు తీసుకున్నట్లు సమాచారం. ‘మేం పంపిన వాటినే తిరస్కరిస్తారా? అక్కడ మీరు ఎలా పనిచేస్తారో చూస్తాం’ అని అధికారులను బెదిరిస్తున్నారు. కాగా, క్రిస్మస్‌ సందర్భంగా కార్డుదారులకు ఏడు రకాల సరుకులను పంపిణీ చేస్తున్నారు. 500 గ్రాముల బెల్లం, కిలో చొప్పున కందిపప్పు, శనగపçప్పు, గోధుమ పిండి, 500 ఎం.ఎల్‌ పామోలిన్‌ ఆయిల్‌ ప్యాకెట్, 100 ఎం.ఎల్‌ నెయ్యి ఇవ్వాల్సి ఉంది.

నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలనేది లక్ష్యం
క్రిస్మస్, సంక్రాంతి కానుకలను నాణ్యమైనవి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన గోధుమ పిండి, నెయ్యి తిరస్కరించాం. జిల్లాకు ఆవు నెయ్యి వచ్చింది.  గోధుమ పిండి ప్యాకెట్లపై వ్యాలిడిటీ డేట్‌ లేదు. కొన్నిటికి ఉన్నా తక్కువగా ఉంది. వ్యాలిడిటీ 3 నెలలు ఉండాలి. గోధుమపిండి ప్యాకెట్లను తిరస్కరించాం. బెల్లం, ఇతర సరుకుల నాణ్యత బాగానే ఉంది.        – ప్రసన్న వెంకటేశ్, జేసీ, కర్నూలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top