జెండా పండుగకు డబ్బుల్లేవ్‌!

Independence Day Celebrations Funds Are Nil Kurnool - Sakshi

కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవం మనందరికీ పెద్ద పండుగ. దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించే అతిపెద్ద వేడుక. కుల, మతాలకు అతీతంగా ‘భారత జాతి’ నిర్వహించుకునే సమున్నత కార్యక్రమం. ఇలాంటి పండుగను పాఠశాలల్లో ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన అవసరముంది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు, ఆటల పోటీలు ఏర్పాటు చేయాలి. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వ తీరు వల్ల ఇవి కష్టసాధ్యమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సర్కారు నిధులు కేటాయించకపోగా, ఉన్న అరకొర నిధులను సైతం వెనక్కి తీసుకుంది. దీంతో ఈ ఏడాది వేడుకలు ఏ విధంగా నిర్వహించాలో తెలియక ప్ర«ధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌లను విలీనం చేసి సమగ్ర శిక్ష అభియాన్‌గా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి ఇచ్చిన నిధులను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వారం రోజుల్లో తిరిగి జమ చేస్తామని చెప్పింది. నెల దాటినా అతీగతీ లేకపోవడంతో పాఠశాలల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 2,902 ఉన్నాయి. వీటిలో సుమారు 4.38 లక్షల మంది  చదువుతున్నారు. వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులను ఎస్‌ఎంసీల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నిధులతోనే సర్కార్‌ స్కూళ్ల నిర్వహణ చూడాలి. వచ్చేది అరకొర నిధులే. వీటినే ఏడాది పాటు చాక్‌పీస్‌లు, చీపుర్లు, స్కూల్‌ కరెంట్‌ బిల్లులు, తదితర వాటికి ఖర్చు చేయాలి.

పైగా రెండేళ్ల నుంచి టీచర్‌ గ్రాంట్‌ నిలిపేశారు. దీనికి తోడు ఈ విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలను ఐదు విడతల్లో ఇచ్చారు. వాటిని మండల విద్యా వనరుల కేంద్రం నుంచి స్కూల్‌ పాయింట్లకు చేర్చేందుకు అయిన రవాణా ఖర్చులనూ హెచ్‌ఎంలే భరించారు. ఇప్పుడు స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చేందుకు కూడా డబ్బు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే తరుణంలో ప్రతి స్కూల్‌లో విద్యార్థులకు ఆటలతో పాటు, వివిధ రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి..బహుమతులు ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఏ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఉత్తర్వులు ఇవ్వడం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది.
 
నిధుల్లేక ఇబ్బందులు  
స్కూళ్లలో చాక్‌పీస్‌లు కూడా కొనలేని పరిస్థితి. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రవాణా కోసం హెచ్‌ఎంలు చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిధులు లేకపోవడం మరింత ఇబ్బందికరం. – డి.రామశేషయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు 

నిధులు జమ చేయాలని కోరాం 
ఎస్‌ఎంసీ ఖాతాల నుంచి రూ.5.8 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇటీవల రూ.3 కోట్లతో ఎస్‌ఎస్‌ఏ, కేజీబీవీ సిబ్బందికి వేతనాలు ఇచ్చాం. నిధులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు కొంత మంది హెచ్‌ఎంలు వినతులిచ్చారు. ఈ క్రమంలో ఇటీవల వెనక్కి తీసుకున్న నిధులను జమ చేయాలని ఎస్‌ఎస్‌ఏ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కోరాం. – తిలక్‌ విద్యాసాగర్, ఎస్‌ఎస్‌ఏ పీఓ 

సొంత ఖర్చులతోనే.. 
స్వాతంత్య్ర వేడుకలకు గ్రాంట్‌ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఎలా? స్కూల్‌ బాగుండాలంటే నిర్వహణ గురించి ఆలోచించాలి. – రమేష్‌ నాయుడు, హెచ్‌ఎం, దేవనబండ హైస్కూల్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top