ఈ-పాస్ ఉంటేనే స్కాలర్‌షిప్‌లు | if have e - pass, scholarships | Sakshi
Sakshi News home page

ఈ-పాస్ ఉంటేనే స్కాలర్‌షిప్‌లు

Jan 22 2014 2:29 AM | Updated on Sep 15 2018 4:12 PM

జిల్లాలో 1.15 లక్షల పేద విద్యార్థుల కోసం ప్రభుత్వమిచ్చే స్కాలర్‌షిప్‌లను సకాలంలో అందించాలని, ఇందుకు ఈ-పాస్ ద్వారా విద్యార్థుల పేర్లను నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ కళాశాల యాజమాన్యాలను కోరారు.

 ఏలూరు, న్యూస్‌లైన్ :  జిల్లాలో 1.15 లక్షల పేద విద్యార్థుల కోసం ప్రభుత్వమిచ్చే స్కాలర్‌షిప్‌లను సకాలంలో అందించాలని, ఇందుకు ఈ-పాస్ ద్వారా విద్యార్థుల పేర్లను నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ కళాశాల యాజమాన్యాలను కోరారు. స్థానిక సీఆర్‌రెడ్డి కళాశాల ఆడిటోరియంలో మంగళవారం కళాశాలల యాజమాన్యం, అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

కొత్తగా స్కాలర్‌షిప్పులు పొందే విద్యార్థులంతా ఈనెల 31లోగా, రెన్యువల్ చేసేకునేవారు ఈ నెల 25లోగా ఈ-పాస్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో 500కు పైగా కళాశాలలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ని రిజిస్టరు కాలేదని అటువంటి కళాశాలలను గుర్తించి ఆన్‌లైన్‌లో వాటి పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావును కలెక్టర్ ఆదేశించారు.

 జిల్లాలోని ప్రతి కళాశాల విధిగా వెబ్‌సైట్ రూపొందించుకోవాలని అందులో పనిచేసే ఫ్యాకల్టీ వివరాలు, కళాశాల సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరచాలని, వారంరోజుల్లో ఈ ప్రక్రియను కళాశాలలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ-పాస్ ద్వారా ఆన్‌లైన్ చేయడానికి రూపొందించిన మైక్రో ప్రాసెసర్ ధరను రూ. 27 వేల నుంచి తక్కువకు అందించేలా తగు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సీపీవో కె సత్యనారాయణ, డీఈవో ఆర్.నరసింహారావు, ఎన్‌ఐసీ సైంటిస్ట్ గంగాధర్ పాల్గొన్నారు.

 విలువలతో కూడిన విద్య అవసరం
 ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన అందించినపుడే ఆశించిన ఫలితాలు సాధ్యమని కలెక్టర్ సిద్ధార్థ జైన్ చెప్పారు. విద్యాప్రమాణాల తీరుపై ఎంఈవోలు, సహాయ సాంఘిక సంక్షేమాధికారులతో మంగళవారం ఆయన ఏలూరులో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తాను పలు ఇంటర్వ్యూలు నిర్వహించానని అయితే ఒక్క విద్యార్థి కూడా సరైన విజ్ఞానం లేకుండా సమాధానాలు ఇచ్చారన్నారు.

 సమాజానికి ఉపయోగపడే విద్యావిధానం కావాలే తప్ప కాగితాలకే పరిమితమయ్యే డిగ్రీలు ఎందుకని కలెక్టర్ ప్రశ్నించారు. ఎల్‌కేజీ నుంచే విద్యాప్రమాణాలు మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడం కష్టమేమి కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement