స్కాలర్‌షిప్‌లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: స్కాలర్‌షిప్‌ల బకాయిల కారణంగా విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేయడమే కాదు.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, విచారణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని చెప్పింది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
పెండింగ్ స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేసేలా సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల సరి్టఫికెట్లను నిలిపివేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఒరిజినల్ సర్టిఫికెట్లు నిరాకరించే కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏదైనా టోల్–ఫ్రీ నంబర్, హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉందా అని అడిగింది. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలకు ఓ యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది. దీంతో బాధితులంతా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది.


